సేవ్ అమరావతి అన్న గొంతు మూగబోయింది ...రాజధాని కోసం తుళ్ళూరు రైతు గుండె ఆగింది
రాజధాని అమరావతిలోనే కొనసాగించాలంటూ అమరావతి 29 గ్రామాల రైతుల ఆందోళనలు కొనసాగిస్తున్నా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది . సీఎం జగన్ మూడు రాజధానుల ఏర్పాటుకు శరవేగంగా పనులు చేయిస్తున్నారు . ఈ నేపధ్యంలో ప్రస్తుతం అమరావతి చుట్టూ ఉన్న 29 గ్రామాల రైతులు నిరసనలు ఉధృతం చేశారు . ఇక ఇప్పటికే రాజధాని అమరావతినే కొనసాగాలని, సేవ్ అమరావతి అని నినదించిన అమరావతి రైతులు పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు.
రాజధాని అమరావతి తరలిపోతుంది అని ప్రచారం మొదలైన నాటి నుండి రాజధానిలో రైతులు, కౌలు రైతులు తీవ్ర మానసిక వేదనతో గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక నేడు రాజధాని అమరావతి తరలింపును నిరసిస్తూ ఆందోళన చేస్తున్న రైతుల్లో మరొకరు ప్రాణాలు కోల్పోయారు. రాజధాని తరలింపును నిరసిస్తూ జరుగుతున్న ఆందోళనల్లో తొలి నుంచీ పాల్గొంటున్న తూళ్లూరు రైతు 43 సంవత్సరాల వయసున్న కంచర్ల చంద్రం మనస్తాపంతో మృతి చెందాడు. గుండెపోటుతో చంద్రం మృత్యువాత పడ్డారు.

రాజధాని అమరావతి కోసం చంద్రం తనకున్న 31 సెంట్ల అసైన్డ్ భూమిని అప్పటి తెలుగుదేశం ప్రభుత్వానికి ఇచ్చాడు. అయితే, ప్రస్తుత ప్రభుత్వం పరిపాలన వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులను ప్రతిపాదించింది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని ప్రాంత రైతులు రెండు నెలలుగా ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం తన మనసు మార్చుకుని రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. రాజధాని అమరావతి తరలిపోతుందని, జగన్ తాజాగా మూడు రాజధానుల ఏర్పాటు వేగం పెంచటంతో ఆందోళన చెందిన చంద్రం ప్రభుత్వం నుంచి ఎటువంటి సానుకూల ప్రకటన రాకపోవడంతో మనస్తాపానికి గురైమృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.












Click it and Unblock the Notifications