పీఆర్సీ పీటముడి వీడకముందే సీఎంజగన్ కు మరో తలనొప్పి; వారంతా జేఏసీగా 24డిమాండ్లతో పోరుబాట
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీఆర్సీపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. పీఆర్సీ పై పీటముడి వీడక ముందే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి మరో కొత్త తలనొప్పి వచ్చి పడింది. పీఆర్సీ విషయం అటుంచి ఇంతకీ మా సంగతేంటో తేల్చాలని డిమాండ్ చేస్తూ తెరమీదకు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు వచ్చారు. పిఆర్సి విషయంలో ఇంకా ఫైనల్ డెసిషన్ కు రాకముందే మరో కొత్త సమస్య తెరమీదకు రావడంతో జగన్ సర్కార్ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది.
Recommended Video

ప్రభుత్వం ముందు 24 డిమాండ్లతో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే అనేక మార్లు తమ సమస్యలను పరిష్కరించాలని ఆందోళనలు చేశారు. ఇక తాజాగా సందట్లో సడేమియా అంటూ ఇప్పటికే పిఆర్సి విషయంలో ఏపీ ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య సందిగ్దత నెలకొన్న సమయంలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు జేఏసీగా ఏర్పడి తమ సమస్యలను ప్రభుత్వం ముందు ఏకరువు పెట్టి, తమ డిమాండ్లను పరిష్కరించివలసిందిగా ఒత్తిడి చేయాలని రంగం సిద్ధం చేస్తున్నారు. జేఏసీగా ఏర్పడిన కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు 24 డిమాండ్లను సిద్ధం చేసి ప్రభుత్వం ముందు ఉంచేందుకు రెడీ అవుతున్నారు.

సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్
కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తాజాగా నిర్వహించిన జేఏసీ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశంలో ప్రభుత్వం ముందు పెట్టాల్సిన డిమాండ్లపై చర్చించారు. ఇప్పటికే అనేక మార్లు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఆందోళన చేసిన కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఇప్పుడు మళ్ళీ అదే డిమాండ్ ను ప్రభుత్వం ముందు ఉంచుతున్నారు. కనీసం 26 వేల రూపాయల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు అర్హత ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తున్నారు.

పని దోపిడీకి గురవుతున్నామని చెప్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ
ఇక జేఏసీ మీటింగ్ లో మాట్లాడిన ఏపీ కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఏడెనిమిది సంవత్సరాలుగా తమకు కనీస జీతాల పెంపు లేదని అన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులు పని దోపిడీకి గురవుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగుల కంటే గంట అదనంగానే పనిచేస్తున్నారని అయినప్పటికీ వారికి అరకొర జీతాలను ఇస్తున్నారని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు బొప్పరాజు వెంకటేశ్వర్లు.

ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే అన్ని వసతులు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కల్పించాలని డిమాండ్
ఇక ప్రభుత్వ ఉద్యోగులకు, కాంట్రాక్టు ఉద్యోగులకు ఎలాంటి తేడా లేదని, అలాంటప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్న అలవెన్సులు, లీవులు, అన్ని రకాల సదుపాయాలను కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వర్తింపజేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగి మరణిస్తే అదే కుటుంబంలోని మరో వ్యక్తికి కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పదవీ విరమణ సమయంలో 15 లక్షల రూపాయలు ఇవ్వాలని వారు కోరుతున్నారు.

పీఆర్సీ పై కసరత్తు సమయంలో షాకిస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ
పిఆర్సి పై కసరత్తు కొనసాగుతున్న సమయంలోనే తమ డిమాండ్ల పరిష్కారానికి కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్న ఆలోచనలో ఉన్నారు కాంట్రాక్ట్ ,ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు. ఏది ఏమైనప్పటికీ తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా బాగా క్షీణించిన పరిస్థితులలో,ఇటు ఉద్యోగులు, అటు కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు మూకుమ్మడిగా జగన్ సర్కార్ మీద దాడి చేయడం, తమ డిమాండ్ల సాధనకు రంగంలోకి దిగటం ఏపీ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పి కాగా, సీఎం జగన్ మోహన్ రెడ్డి కి పెద్ద షాక్ అనే చెప్పాలి.












Click it and Unblock the Notifications