ఆమ్రపాలి పవన్ పేషీకి కాదు..! అందుకేనా చంద్రబాబు ఆలస్యం..?
ఏపీ-తెలంగాణ విభజన నేపథ్యంలో ఏపీకి కేటాయించిన ఐఏఎస్ అధికారి కాటా ఆమ్రపాలి ఆ తర్వాత తెలంగాణకు వెళ్లిపోయారు. కానీ తాజాగా కేంద్ర సిబ్బంది వ్యవహారాలశాఖ ఏపీకి వెళ్లిపోవాలని ఆమెతో పాటు మరో ముగ్గురు ఐఏఎస్ లు రోనాల్డ్ రాస్, వాకాటి కరుణ, వాణీ ప్రసాద్ ను ఆదేశించింది. దీంతో వీరు క్యాట్ ను ఆశ్రయించినా, హైకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ నలుగురు అమరావతికి వచ్చి ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేశారు.
ఇందులో మిగతా వారి సంగతి ఎలా ఉన్నా కాటా ఆమ్రపాలి పోస్టింగ్ విషయంలో మాత్రం రోజుకో కొత్త వార్త తెరపైకి వస్తోంది. ఆమెను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషీలో నియమిస్తారని, లేదు జీవీఎంసీ కమిషనర్ గా నియమిస్తారని మరికొందరు చెప్తున్నారు. అయితే తాజాగా అందుతున్న సమాచారాన్ని బట్టి ఆమెను తిరిగి తెలంగాణకు పంపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆమెతో పాటు మరో అధికారి రోనాల్డ్ రాస్ ను కూడా వెనక్కి పంపడంపై చర్చలు జరుగుతున్నాయి.

తెలంగాణలో కీలక బాధ్యతల్లో ఉన్న కాటా ఆమ్రపాలి, రోనాల్డ్ రాస్ లను ఏపీకి పంపడం ద్వారా పెను ప్రభావం పడుతుందని భావిస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ వీరిద్దరిని ఇంటర్ స్టేట్ డిప్యూటేషన్ పై తమ రాష్ట్రానికి పంపాలని సీఎం చంద్రబాబును కోరుతున్నట్లు తెలుస్తోంది. అదే నిజమైతే వీరిద్దరి విషయంలో చంద్రబాబు తీసుకోబోయే నిర్ణయం కీలకంగా మారింది. ముఖ్యంగా ఏపీలో రిపోర్ట్ చేయగానే తెలంగాణకు డిప్యుటేషన్ పై పంపేస్తే విమర్శలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఏం చేయాలన్న దానిపై ఏపీ ప్రభుత్వం ఆలోచిస్తోంది. అందుకే వీరికి ఇంకా పోస్టింగ్ లు ఇవ్వలేదని సమాచారం.












Click it and Unblock the Notifications