త్వరలో మరో వైసీపీ ఎంపీ గుడ్ బై ? ఆ రెండు టికెట్ల కోసం టీడీపీతో మంతనాలు !
ఏపీలో వైసీపీ ఎంపీల రాజీనామాల పర్వం కొనసాగుతోంది. వైసీపీ ఇన్ ఛార్జ్ ల మార్పులు చేపట్టిన తర్వాత ఇప్పటికే ముగ్గురు ఎంపీలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. వీరిలో కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు వంటి వారు ఉన్నారు. ఇప్పుడు మరో ఎంపీ అదే బాటలో ఉన్నారు. వైసీపీ ఇన్ చార్జ్ ల మార్పుల్లో తనకు సీటు దక్కదని తేలిపోవడంతో నిన్న మొన్నటివరకూ తుది ప్రయత్నాలు చేసిన ఆయన.. ఇప్పుడు తన దారి చూసుకునేందుకు సిద్దమయ్యారు.
గత సార్వత్రిక ఎన్నికల్లో ఒంగోలు నుంచి ఎంపీగా గెలిచిన మాగుంట శ్రీనివాసులురెడ్డి ఈసారి కూడా టికెట్ దక్కుతుందనే ధీమాతో ఉన్నారు. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసులురెడ్డి మద్దతు, ఆయనకు సీఎం జగన్ తో ఉన్న కుటుంబ సంబంధాల నేపథ్యంలో తన సీటుకు ఢోకా లేదని భావించారు. కానీ సీఎం జగన్ మాత్రం ఐప్యాక్ సర్వేల ఆధారంగా మాగుంట మరోసారి ఒంగోలులో గెలిచే పరిస్ధితి లేదని తేల్చేశారు. దీంతో ఆయనకు సీటు లేదని బాలినేనికే చెప్పేశారు. దీంతో మాగుంట త్వరలో వైసీపీకి గుడ్ బై చెప్పి .. మరో పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధమైపోతున్నారు.

ఇప్పటికే టీడీపీ నేతలతో సంప్రదింపులు మొదలుపెట్టిన మాగుంట శ్రీనివాసులురెడ్డి ఒంగోలు నుంచే ఎంపీ టికెట్ హామీ కోరుతున్నారు. అలాగే ఆయన కుమారుడు రాఘవరెడ్డికి కూడా ఎమ్మెల్యే సీటు అడుగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ రెండు టికెట్లపై హామీ లభిస్తే మాగుంట పార్టీ మారడం ఖాయంగా కనిపిస్తోంది. వైసీపీలో ద్వారాలు మూసుకుపోవడంతో ఇక ఆ పార్టీకి గుడ్ బై చెప్పేయడం లాంఛనమే. అదే సమయంలో టీడీపీ నుంచి టికెట్ల హామీ లభిస్తే వెంటనే చేరిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications