అసెంబ్లీకి హాజరు పై జగన్ కీలక నిర్ణయం - అక్కడే తేల్చుకుందాం..!!
మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 2024 ఎన్నికల తరువాత 11 సీట్లకే పరిమితం అయిన వైసీపీ ప్రతిపక్ష హోదా డిమాండ్ చేస్తూ అసెంబ్లీకి దూరంగా ఉన్నారు. మారుతున్న రాజ కీయ పరిణామాలతో జగన్ తన నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల హాజరు పైన పార్టీ ముఖ్య నేతలకు ఇప్పటికే సమాచారం ఇచ్చారు. కాగా, ఇటు వచ్చే నెల 18వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యే అవకాశం కనిపిస్తోంది.
ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. వచ్చే నెల 18 నుంచి ఏపి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే వారం జరిగే కేబినెట్ భేటీలో దీని పైన అధికారికంగా నిర్ణయం తీసుకోనున్నారు. పది రోజుల పాటు అసెంబ్లీ నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు.. తీసుకున్న నిర్ణయాల గురించి అసెంబ్లీ వేదికగా వివరించాలని ప్రభుత్వం భావిస్తోంది. అమరావతి రాజధాని పైన ప్రత్యేకంగా చర్చ చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. కొన్ని కీలక బిల్లులను కూడా అసెంబ్లీ లో ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది.

ఇక, 2024 ఎన్నికల్లో ఓడిన తరువాత వైసీపీ నేతలు సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. మాజీ సీఎం జగన్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం.. గవర్నర్ ప్రసంగాల సమయంలోనే సభకు హాజరయ్యారు. ఆ తరువాత ఏ చర్చలోనూ పాల్గొన లేదు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలనే డిమాండ్ తో జగన్ సభకు దూరంగా ఉంటున్నారు. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మారుతున్న సమీకరణాలు.. వైసీపీ నేతల పైన కేసులు.. వరుస అరెస్టుల వేళ జగన్ తన నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తోంది. జగన్ తన మీడియా సమావేశాల ద్వారా మాత్రమే తన వాయిస్ వినిపించే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో అసెంబ్లీకి వెళ్లి తన హయాంలో అవినీతి జరిగిందని నమోదవుతున్న కేసుల పైన సభలోనే మాట్లాడాలని జగన్ డిసైడ్ అయినట్లు సమాచారం. లిక్కర్ కేసు పైన చర్చకు డిమాండ్ చేయాలని జగన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశం పైన పార్టీ ముఖ్య నేతలకు జగన్ సూచించారు. తన హయాంలో లిక్కర్ స్కాం జరగలేదని.. టీడీపీ హయాంలో చోటు చేసుకున్న పరిణామాలను సభ ద్వారా వివరించాలనేది జగన్ ప్లాన్ గా చెబుతున్నారు. అదే విధంగా కూటమి ప్రభుత్వం చేసిన అప్పులు.. పథకాల హామీలు గురించి నిలదీసేందుకు అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వాలని జగన్ భావిస్తున్నారని పార్టీ నేతల సమాచారం. అసెంబ్లీ సమావేశాల కు ఇప్పుడు జగన్ హాజరు కావాలనే అంశం పార్టీలో చర్చగా మారింది. దీంతో, జగన్ అసెంబ్లీకి హాజరైతే సమావేశాల్లో చోటు చేసుకునే పరిణామాల పైన ఆసక్తి నెలకొంది.












Click it and Unblock the Notifications