GST 2.0: జీఎస్టీ 2.0కు మద్దతుగా అసెంబ్లీ తీర్మానం.! గేమ్ ఛేంజర్ అన్న సీఎం..!
కేంద్రం తాజాగా జీఎస్టీ స్లాబ్ రేట్లలో చేసిన మార్పుల్ని స్వాగతిస్తూ ఏపీ అసెంబ్లీ ఇవాళ ఓ తీర్మానం చేసింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన తీర్మానానికి ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. దీంతో జీఎస్టీ-2.0 సంస్కరణల్ని స్వాగతిస్తూ దేశంలో తొలిసారి తీర్మానం చేసిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ప్రజలకు, దేశ ఆర్థికాభివృద్ధికి ఊతమిచ్చేలా సంస్కరణలు తెచ్చిన ప్రధానికి ఏపీ అసెంబ్లీ ధన్యవాదాలు తెలిపింది. జీఎస్టీ-2.0 రూపకల్పనలో తన వంతు పాత్ర పోషించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నూ అభినందించింది.
అసెంబ్లీలో జీఎస్టీ తీర్మానంపై చంద్రబాబు కీలక ప్రసంగం చేశారు. గతంలో సీఎస్టీ, వ్యాట్ లాంటి సంక్లిష్టమైన పన్నుల వ్యవస్థ ఉండేదని, 17 రకాల పన్నులు , 13 రకాల సెస్సులు సర్ ఛార్జీలు ఉండేవని బాబు తెలిపారు. ఒక ఉత్పత్తికి అనుబంధ ఉత్పత్తులు వచ్చినా పన్నులు వేసే పరిస్థితి ఉండేదని,140 కోట్ల మంది ప్రజలకు ప్రయోజనం కలిగేలా జీఎస్టీలో రెండు స్లాబులతో సంస్కరణలు తీసుకువచ్చిందని తెలిపారు.

రెండు శ్లాబులతో పన్నుల వ్యవస్థను మరింత సరళతరం చేశారన్నారు. ప్రభుత్వానికి ఆదాయం వస్తే అభివృద్ధి సంక్షేమం జరుగుతుందన్నారు.నెక్స్ జెన్ జీఎస్టీ అమలు దేశంలో ఓ గేమ్ చేంజర్ అన్నారు. సంపద సృష్టించని వారికి సంక్షేమం చేసే అధికారం లేదన్నారు. కేంద్రం తీసుకువచ్చిన ఈ సంస్కరణలతో ముందుగానే దీపావళి, దసరా పండుగల బోనస్ ఇచ్చారని, 99 శాతం మేర వస్తువులన్నీ 5 శాతం పన్ను పరిధిలోకే వచ్చాయన్నారు. పేద మధ్యతరగతి అందరికీ లబ్ది కలుగుతుందన్నారు. దీంతో పన్ను చెల్లింపు దారుల సంఖ్య 1.51 కోట్లకు పెరిగిందన్నారు. అలాగే జీఎస్టీ వసూల్లు 22 లక్షల కోట్లకు పెరిగాయన్నారు.
వన్ నేషన్-వన్ ట్యాక్స్ అనే విధానం సక్రమంగా అమలు కావటం వల్ల ప్రయోజనం చేకూరుతోందని చంద్రబాబు తెలిపారు.
ఈ నెక్స్ జెన్ రిఫార్మ్స్ వల్ల ప్రపంచవ్యాప్తంగా డబుల్ డిజిట్ గ్రోత్ సాధించే దేశంగా భారత్ ఉంటుందన్నారు. జీఎస్టీ సంస్కరణలతో వచ్చిన ప్రయోజనాలను ప్రజలందరికీ చేరువ చేసే బాధ్యత అందరం తీసుకోవాలన్నారు. నిత్యావసర వస్తువులు సబ్బులు, టూత్ పేస్టు, షాంపూలు, నెయ్యి లాంటి వస్తువులన్నీ 5 శాతానికి వచ్చాయన్నారు. ఏసీలు, ఫ్రిడ్జ్ ల ధరలు కూడా గణనీయంగా తగ్గుతాయన్నారు. జీవిత భీమా, ఆరోగ్య బీమాలకు కూడా జీఎస్టీ సున్నా శాతానికి వెళ్లిందన్నారు.

యూనివర్సల్ హెల్త్ పాలసీ ద్వారా రూ.750 కోట్ల వరకూ ఏపీకి ఆదా అవుతుందని చంద్రబాబు తెలిపారు. అగ్రిటెక్ యంత్రాలకు కూడా గణనీయంగా పన్ను తగ్గిందని, రైతులకు ప్రయోజనం కలుగుతుందని వెల్లడించారు. ఇళ్ల నిర్మాణానికి వినియోగించే వస్తువుల ధరలు కూడా 5 శాతం శ్లాబ్ లోకి వచ్చాయన్నారు. నిర్మాణ రంగం పుంజుకుంటుందని, సాధారణ ప్రజలు కూడా వినియోగించుకునేలా ఎలక్ట్రానిక్స్ వస్తువులపై జీఎస్టీ తగ్గిందని సీఎం వివరించారు. రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికీ ఈ జీఎస్టీ ప్రయోజనాలు దక్కాలని, చిట్ట చివరి వ్యక్తికి కూడా ఈ అంశాలు తెలియాలని సూచించారు.












Click it and Unblock the Notifications