‘ఎన్నో వరాలిచ్చారు’: ప్రధాని మోడీకి ఏపీ పూతరేకులు
ప్రధాని నరేంద్ర మోడీ అమితంగా ఇష్టపడే పూతరేకులను సంక్రాంతి కానుకగా అందించనున్నారు.
న్యూఢిల్లీ/అమరావతి: ప్రధాని నరేంద్ర మోడీ అమితంగా ఇష్టపడే పూతరేకులను సంక్రాంతి కానుకగా అందించనున్నారు పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం భారతీయ జనతా పార్టీ నేతలు. రాష్ట్ర పార్టీ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న పురిగెళ్ళ రఘురాం ఇప్పటికే వీటిని తయారుచేయించి ఢిల్లీకి తీసుకువెళ్లారు.
నెయ్యి, జీడిపప్పు, బెల్లం, హార్లిక్స్‌తో వీటిని సాంప్రదాయబద్దంగా తయారుచేయించారు. పూతరేకులతోపాటు రాజులడ్డూ, అరిసెలను ప్రధానికి అందించేందుకు తీసుకువెళ్లినట్లు తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతోపాటు పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, బిజెపి అగ్రనేత అద్వానీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, నితిన్‌గడ్కారీలకు వీటిని అందివ్వనున్నారు.

కాగా, ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆంధ్రప్రదేశ్‌కు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారని నేతలు చెప్పారు. అంతేకాకుండా ఇక్కడ రైతాంగానికి ఎంతో అవసరమైన పోలవరం ప్రాజెక్టుకు భారీగా నిధులు ఇవ్వడం, కేంద్ర విద్యాసంస్థలు ఏర్పాటుచేయడం, సాగరమాలలో మరింత ప్రాధాన్యత ఇచ్చారని రఘురాం చెప్పారు.
ఇన్ని వరాలు ఇచ్చిన మోడీకి తెలుగు ప్రజలు సాంప్రదాయంగా చేసుకునే సంక్రాంతి పండుగ మిఠాయి రాష్ట్ర ప్రజలు తరుపున అందిస్తున్నామని బిజెపి నేత రఘురాం తెలిపారు.












Click it and Unblock the Notifications