ఇందుమూలంగా యావన్మందికీ తెలియజేయునదేమనగా...
కేంద్ర ప్రభుత్వం రూ.8 లక్షల కోట్లతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తోందని.. అందులో రూ.3లక్షల కోట్లను రాష్ట్రంలోని రహదారుల నిర్మాణానికే వెచ్చిస్తోందని భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వెల్లడించారు. ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు కేవలం బీజేపీకే ఉందని స్పష్టం చేశారు. విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పలు విషయాలను తెలిపారు.
పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలన్న సంకల్పంతోనే కేంద్రం గత నాలుగు సంవత్సరాల కాలంలో రూ.15వేల కోట్లు నిధులు మంజూరు చేసిందని చెప్పారు. క్రమేపీ ప్రాజెక్టు అంచనా వ్యయం పెరగడానికి రాష్ట్ర ప్రభుత్వాలే కారణమని విమర్శించారు.

వినాయక చవితి పర్వదినాన్ని వైభవంగా చేసుకోవాలని ఒకవైపు చెబుతూనే మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధిస్తోందంటూ వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కొవిడ్ ఆంక్షలు వినాయకచవితి, దసరా పర్వదినాలకు విధించారని గుర్తుచేశారు. కొవిడ్ తగ్గుముఖం పట్టిన ఇప్పుడు కూడా అదే విధానాలను అనుసరించడం సరికాదన్నారు.
వినాయక చవితి ఉత్సవాల పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాసినా ఇంతవరకు సమాధానం ఇవ్వలేదని మండిపడ్డారు. ఏపీ దేవదాయశాఖ చవితి పందిళ్లకు ఎటువంటి రుసుము వసూలు చేయడంలేదని, అదంతా దుష్ప్రచారమంటూ చెప్పిందని, కానీ అటువంటి ప్రకటన ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ఏపీలో రూ.3 లక్షల కోట్లతో రహదారులను అభివృద్ధి చేస్తున్నామంటూ సోము వీర్రాజు చేసిన ప్రకటనపై రాజకీయ విశ్లేషకులంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications