ఏపీలో కాంగ్రెస్-టీడీపీ పొత్తు ? బీజేపీ నేత విష్ణు సంచలన కామెంట్స్
తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ నుంచి చివరి నిమిషంలో తప్పుకుని కాంగ్రెస్ పార్టీ విజయానికి పనిచేసింది. అభ్యర్ధుల ప్రచారంతో పాటు గాంధీ భవన్ లో కాంగ్రెస్ గెలిచాక కూడా టీడీపీ జెండాలు విరివిగా కనిపించాయి. దీంతో టీడీపీ-కాంగ్రెస్ మధ్య స్నేహం తెలంగాణ ఎన్నికల్లో బాగానే పనిచేసిందన్న చర్చ జరిగింది. ఇప్పుడు ఏపీలోనూ ఇరు పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నాయా, అలా చేస్తే బీజేపీ ఏం చేయబోతోందన్న చర్చకు ఆ పార్టీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు.
మూడు రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయాలను ప్రస్తావిస్తూ ఏపీలోనూ తమ పార్టీ... జనసేనతో కలిసి మంచి ఫలితాలు రాబడుతుందని విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. తమకో వ్యూహం ఉందని, దాని ప్రకారం ముందుకెళ్తామన్నారు. తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు కలిసి బీజేపీ-జనసేన పార్టీలకు వ్యతిరేకంగా పని చేడం రాజకీయ తప్పిదమన్నారు. ఏపీ లో తెలుగు దేశం- కాంగ్రెస్ కలిసి పోటీచేస్తున్నట్లు కొందరు ఈ మధ్య ప్రచారం చేస్తున్నారని ఆక్షేపించారు.

తమ పార్టీ పొత్తుల అంశంపై జాతీయ పార్టీ నిర్ణయం తీసుకుంటుందని విష్ణుతెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు కోసం పని చేసి, గాంధీ భవన్ లో టీడీపీ జెండాలతో తిరిగిన తెలుగుదేశం.. ఏపీలో బీజేపీతో కలవాలని ఎందుకు అనుకుంటోందని విష్ణు ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు చంద్రబాబు, ఆయన పార్టీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయాల్లో చివరి వరకు ఏమైనా జరగొచ్చన్నారు. తద్వారా భవిష్యత్తులో ఏపీలో కాంగ్రెస్-టీడీపీ కలిసి పనిచేసే అవకాశం ఉందని పరోక్షంగా తెలిపారు.
మరోవైపు అనంతపురం నగరంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం పెడతామని అధికారులకు దరఖాస్తు చేసుకున్నామని, కానీ అనుమతి రాలేదని, ఇంతలో కొంతమంది వైసీపీ నేతలు ఉద్దేశపూర్వకంగా టిప్పు విగ్రహం పెట్టడానికి భూమిపూజ చేశారన్నారు.
వైసీపీ నాయకులకు విష్ణు ఓ ఛాలెంజ్ విసిరారు. వల్లభాయ్ పటేల్, టిప్పు సుల్తాన్ విగ్రహాల విషయంలో ప్రజాభిప్రాయం తీసుకుందామని, ఎవరి విగ్రహం కావాలో ప్రజలే నిర్ణయిస్తారన్నారు.












Click it and Unblock the Notifications