ఏపీ కేబినెట్ విస్తరణ ముహూర్తం ఫిక్స్..!! ఎవరెవరికి ఛాన్స్ దక్కనుంది : సమీకరణాలు ఖరారు..!!
ముఖ్యమంత్రి జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలుగు సంవత్సరాది ఉగాది నాడు కొత్త జిల్లాలతో పాటుగా.. కొత్త మంత్రులతో పాలన ప్రారంభించాలని సీఎం నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. అందులో భాగంగా ప్రస్తుతం ఉన్న మంత్రులతో ఈ నెల 27వ తేదీన రాజీనామాలు కోరనునున్నట్లుగా తెలుస్తోది. ప్రస్తుత కేబినెట్ లో అయిదుగురు మంత్రులు తిరిగి కొనసాగునున్నట్లు తెలుస్తోంది. ఉగాది రోజున కొత్త కేబినెట్ ప్రమాణ స్వీకారం ఉంటుందని పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు. ఇదే విషయాన్ని ఈ రోజు జరిగే పార్టీ ఎమ్మెల్సీలు..ఎమ్మెల్యేల సమావేశంలో సీఎం జగన్ అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. అయితే, జగన్ తన తొలి కేబినెట్ కూర్పు సమీకరణాలనే తిరిగి అమలు చేయనున్నారు.

కేబినెట్ కూర్పు లో ఆచితూచి
బీసీ - ఎస్సీ - మైనార్టీ కోటాలో అదే సంఖ్యలో మంత్రులు కేబినెట్ లో కొనసాగుతారు. తిరిగి మహిళకే హోం మంత్రి గా అవకాశం దక్కనుంది. అదే విధంగా అయిదు వర్గాల నుంచి అయిదుగురు డిప్యూటీ సీఎంలు సైతం ఉండనున్నారు. అయితే, కొత్త జిల్లాల ఏర్పాటుతో అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం దక్కేలా కేబినెట్ విస్తరణ ఉంటుందని చెబుతున్నారు.
ఇప్పటికే మంత్రివర్గంలో స్థానం కోసం ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉందని స్వయంగా సీఎం చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో సామాజిక సమీకరణాల్లో భాగంగా కొందరు మంత్రులను కొనసాగించాల్సి ఉందని స్పష్టం చేసారు. ఇక, ఈ సారి మహిళా మంత్రులుగా మూడు రీజియన్ల నుంచి ముగ్గురికి అవకాశం దక్కనున్నట్లు తెలుస్తోంది.

నేటి సమావేశంలో జగన్ క్లారిటీ
మంత్రి పదవులు కోల్పోతున్న వారికి పార్టీ బాధ్యతలు అప్పగించనున్నట్లు ఇప్పటికే సీఎం వెల్లడించారు. కొత్త జిల్లాల వారీగా పార్టీ అధ్యక్ష పదవులు అప్పగించనున్నారు. అయితే, ప్రధానంగా ఈ సారి బీసీ వర్గాల్లో ఇప్పటి వరకు అవకాశం దక్కని సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇస్తారని చెబుతున్నారు. రెడ్డి సామాజిక వర్గానికి నాలుగు.. బీసీ - ఎస్సీ వర్గాలకు ప్రస్తుత కేబినెట్ లో ఉన్న నిష్ఫత్తిలోనే మరోసారి మంత్రి పదవులు కేటాయించే అవకాశం ఉంది. అయితే, ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో పెద్దిరెడ్డి.. బుగ్గన...కొడాలి నాని తో పాటుగా..కన్నబాబు లేదా పేర్ని నాని లో ఒకరిని కొనసాగించే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. సీనియర్ నేత బొత్సాకు రాజ్యసభకు పంపుతారనే ప్రచారం సాగుతోంది.
Recommended Video

కొనసాగేదెవరు.. కొత్తగా వచ్చేదెవరు
ఇక, ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రస్తుతం ఉన్న మంత్రుల సమీకరణాల ఆధారంగానే కొత్త వారిని తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రాయలసీమ నుంచి బీసీ వర్గాలకు ప్రాధాన్యత దక్కే అవకాశం కనిపిస్తోంది. ఈ సమీకరణాలకు సంబంధించి నేటీ ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీల సమావేశంలో సీఎం ఎవరి ఎంపిక వెనుక కారణాలను వివరించనున్నారు. అదే విధంగా ఇప్పటి వరకు ఉన్న పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తల్లోనూ మార్పుల దిశగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. దీంతో.. సీఎం జగన్ ఎమ్మెల్యేల సమావేశంలో ఏం చెప్పబోతున్నారనే అంశం పైన ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications