ఏపీలో రెండో అధికారిక భాషగా: చట్టసవరణ: మంత్రివర్గ నిర్ణయాలివే: గౌతమ్ రెడ్డి మృతిపట్ల
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ఏర్పాటైన మంత్రివర్గ సమావేశం.. పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. తీర్మానాలు చేసింది. ఈ మధ్యకాలంలో వైఎస్ జగన్ చేసిన ప్రకటనలను కార్యరూపంలోకి తీసుకొచ్చింది. కొత్త జిల్లాల ఏర్పాటుపై నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా అందిన సూచనలు, సలహాలు అభ్యంతరాలపై చర్చించింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టాల్సిన ముసాయిదా బిల్లులపై మంత్రులు చర్చించారు. తమ అభిప్రాయాలను వెల్లడించారు.

మంత్రి మేకపాటికి నివాళి..
కేబినెట్ సమావేశమైన వెంటనే- ఇటీవలే గుండెపోటుతో కన్నుమూసిన ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి నివాళి అర్పించింది. ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా వైఎస్ జగన్ ప్రస్తావించారు. కష్ట సమయంలో తన వెంట నడిచిన ఆప్తుడిని కోల్పోయానని వ్యాఖ్యానించారు. మంత్రిగా తన శాఖను సమర్థవంతంగా నిర్వహించారని పేర్కొన్నారు. చివరి వరకూ రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకుని రావాలనే లక్ష్యంతో పని చేశారని చెప్పారు.

రెండో అధికారిక భాషగా..
రాష్ట్రంలో ఉర్దూను రెండో అధికారిక భాషగా గుర్తించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉర్దూ రెండో అధికారిక భాషగా ఉన్న విషయాన్ని మంత్రులు ప్రస్తావించారు. ఉర్దూను రెండో అధికారిక భాషగా గుర్తించడానికి ఏపీ అధికార భాషా చట్టాన్ని సవరించాలని తీర్మానించారు. ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 సంవత్సరాలకు పెంచే నిర్ణయానికి మంత్రులు ఆమోదం తెలిపారు. నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ల ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

రుణ సమీకరణకు
మచిలీపట్నం,భావనపాడు, రామాయపట్నం పోర్టుల నిర్మాణం కోసం 8,741కోట్ల రూపాయల రుణాన్ని సమీకరించుకోవడానికి ఏపీ మారిటైం బోర్డుకు అనుమతి ఇచ్చారు. దీనికి ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వడానికి ముందుకొచ్చింది. అనంతపురం మడకశిర బ్రాంచ్ కెనాల్ పనులకు 214 కోట్ల రూపాయలను కేటాయించాలని నిర్ణయించారు. విదేశీ మద్యం నియంత్రణ చట్టానికి సవరణ చేయాలని మంత్రులు తీర్మానించారు.

వాటికి స్టాంప్ డ్యూటీ మినహాయింపు..
ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల్లో గిడ్డంగుల నిర్మాణానికి స్టాంప్ డ్యూటీ మినహాయింపు ఇవ్వాలని కేబినెట్ తీర్మానించింది. దీనికి సంబంధించిన బిల్లుకు ఆమోదం తెలిపింది. తూనికలు, కొలతల శాఖలో డిప్యూటీ కంట్రోలర్ పోస్టును జాయింట్ కంట్రోలర్ (అడ్మిన్) స్థాయికి పెంచాలని నిర్ణయించింది. బెంగుళూరు-కడప, విశాఖపట్నం-కడప మధ్య వారానికి మూడు విమాన సర్వీసులు నడిపించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇండిగో ఎయిర్‌లైన్స్‌తో ఏపీఏడీసీఎల్ ఒప్పందానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.

టీటీడీలో..
తిరుమల తిరుపతి దేవస్ధానం పాలక మండలిలో ప్రత్యేక ఆహ్వానితులపై అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో కొత్తగా ఏర్పాటు చేయనున్న డిగ్రీ కళాశాలలో 24 టీచింగ్ పోస్టులు, 10 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆర్చరీ క్రీడాకారిణి, అర్జున అవార్డు గ్రహీత కుమారి జ్యోతి సురేఖకు డిప్యూటీ కలెక్టర్ నియామకానికి సంబంధించిన ప్రతిపాదనలను ఆమోదించింది.












Click it and Unblock the Notifications