ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు-అమరావతిలో భూసేకరణ, ఆటో డ్రైవర్ల పథకం సహా..!
ఏపీలో ఇవాళ సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో అమరావతిలో భూసమీకరణకు భూములివ్వని వారికి భూసేకరణ పథకం అమలు చేయడం, ఆటో డ్రైవర్ల పథకం, క్యారవాన్ టూరిజం సహా పలు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ వంటి నిర్ణయాలు ఉన్నాయి. అలాగే తాజాగా అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటంపై మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు.
ఇవాళ కేబినెట్ భేటీలో ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్నికల్ హబ్స్‌కు ఆమోద ముద్ర వేశారు. అలాగే ఆటో, క్యాబ్ డ్రైవర్లకు రూ.15 వేలు చొప్పున ఇచ్చేందుకు ఆమోదం తెలిపారు. క్యారవాన్ టూరిజం, హోంస్టేలు అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా తొలి 25 క్యారవాన్‌లకు 100శాతం లైఫ్ ట్యాక్స్ మాఫీ ఉంటుందని, ఆ తర్వాత వచ్చే వాటికి ఇన్సెంటివ్‌లు ఇవ్వనున్నారు.

అమృత్ పథకం 2.O పనులకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. హంద్రీ - నీవా ప్రాజెక్టులో అమిడ్యాల లిఫ్ట్ స్కీం పనులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రకాశం బ్యారేజీ వద్ద, దివిసీమ వద్ద వీక్ అయిన బండ్స్‌ను రూ.4.49 కోట్లతో మరమ్మత్తులు చేసేందుకు ఆమోదం తెలిపారు. వైఎస్సార్ కడప జిల్లాలో మైలవరం రిజర్వాయర్ కు రూ.3కోట్లతో రిపేర్లు చేయించడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే అనంతపురం - ఉరవకొండ-వజ్రకరూరుకి కొత్త లిఫ్ట్ స్కీంకు కేబినెట్ ఆమోదించింది.

మరోవైపు మంత్రివర్గ భేటీ అజెండాపై చర్చ తర్వాత సీఎం చంద్రబాబు రాజకీయ అంశాలపై మంత్రులతో మాట్లాడారు. అసెంబ్లీలో తెలిసో తెలియకో కొందరు ఎమ్మెల్యేలు ఇష్టారీతిన మాట్లాడారని,తమ జిల్లా పరిధిలో ఉన్న ఏడుగురు ఎమ్మెల్యేలను నియoత్రించాల్సిన బాధ్యత ఇన్చార్జ్ మంత్రులదేనని చంద్రబాబు తెలిపారు. నిరంతరం ఎమ్మెల్యేలతో ఇన్చార్జ్ మంత్రులకు రాజకీయ సమన్వయం ఉండాలన్నారు. శాఖా పరంగా ఎలాంటి విమర్శలు వచ్చినా గట్టిగా స్పందించాలని సూచించారు.
కర్నూల్ లో ఈ నెల 16న ప్రధాని మోదీ పర్యటన విజయవంతం చేయాలని సూచించారు.












Click it and Unblock the Notifications