వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. రాష్ట్రంలో వంట గ్యాస్ కష్టాల పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. ఇప్పటికే గ్యాస్ ఏజెన్సీలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఎక్కడా వంట గ్యాస్ కొరత లేదని చెబుతోంది. అదే విధంగా రాష్ట్రంలో కొత్త పాలసీ తీసుకొచ్చేందుకు నిర్ణయించింది. ఇక, పెట్రో ఉత్పత్తుల సరఫరా పైన ఆందోళన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఈ మేరకు ఈ రోజు జరిగే మంత్రివర్గ భేటీలో పలు నిర్ణయాలకు ఆమోదం తెలపనున్నారు.
ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ ఈరోజు(గురువారం) భేటీ కానుంది. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ రాజధానిపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఏపీ రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ సూచనలతో ఈనెల 28 ఉదయం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహణకు ప్రభుత్వం నిర్ణయించింది. కాగా, రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజల్లో వంట గ్యాస్, పెట్రో ఉత్పత్తుల సరఫరా పైన ఆందోళన నెలకొన్న వేళ..వాటిని తొలిగించేందుకు కీలక నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్రంలో పలు చోట్ల హోటల్స్ మూసివేశారు. దీంతో ఎల్‌పీజీ నుంచి పీఎన్‌జీకి కనెక్షన్లు మార్చే అంశంపై చర్చించే అవకాశం కనిపిస్తోంది. గ్యాస్ సిలిండర్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా మంత్రిమండలి కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. న్యాచురల్ గ్యాస్ పాలసీ ఫర్ ప్రమోషన్ ఇన్ కమర్షియల్ సెక్టార్ పాలసీకి ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలపనుంది. పట్టణాల్లోని వినియోగదారులను ఎల్పీజీ నుంచి పీఎన్‌జీ (పైప్డ్ నేచురల్ గ్యాస్) వైపు మళ్లించేందుకు పైప్డ్ గ్యాస్‌పై కొత్త పాలసీ ప్రభుత్వం రూపొందించింది. దీని పైన ఈ రోజు నిర్ణయం తీసుకోనున్నారు.

పీఎన్జీ పాలసీ పై కేబినెట్ లో చర్చ ఆమోదం..!
ఇప్పటికే ఈ పాలసీ పైన మంత్రి మనోహర్ స్పష్టత ఇచ్చారు. పట్టణ ప్రాంతాల్లో పైప్డ్ గ్యాస్ సరఫరాకు అవకాశం ఉన్నచోట వినియోగానికి ఈ పాలసీ ఉంటుందన్నారు. పైప్డ్ గ్యాస్ విషయం లో కేంద్రం ఇచ్చే రాయితీలపై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. పట్టణాల్లో ప్రజలు పైప్డ్ గ్యాస్ కోసం నమోదు చేసుకోవాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2.34 లక్షల మంది పైప్డ్ గ్యాస్‌ను వినియోగిస్తున్నారని చెప్పారు. పలు పట్టణాల్లో పైప్డ్ గ్యాస్ కోసం పైపులు వేయాల్సి ఉందన్నారు. వచ్చే వారం నుంచి హాస్టళ్లకు వేసవి సెలవులు ఇచ్చాక రెస్టారెంట్లు, హోటళ్లకు సిలిండర్ల సరఫరా పెంచి వ్యాపారానికి ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. 26న ఎల్‌పీజీ ట్యాంకర్ ఒకటి విశాఖపట్నం పోర్టుకు రానున్నట్లు ఆయిల్ కంపెనీలు సమాచారం ఇచ్చాయని, ఆ ట్యాంకర్ రాగానే మన గ్యాస్ నిల్వలు మరింత పెరుగుతాయని తెలిపారు. సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌లో అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. బ్లాక్ మార్కెట్‌లో సిలిండర్లు అమ్మకాలపై 800 కేసులు పెట్టామని, 3 వేల 540 సిలిండర్లు సీజ్ చేశామన్నారు. రాష్ట్రంలో ఎక్కడా డీజిల్, పెట్రోల్ కొరత లేదని మంత్రి చెప్పారు. ధరల పెరుగుదలపై రాష్ట్ర స్థాయి టోల్ ఫ్రీ నంబరు 1967కి లేదా జిల్లా స్థాయిలో ఫిర్యాదు చేయవచ్చని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications