AP Cabinet: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. కొత్త ప్రాజెక్టులు, వర్సిటీలు, భూపందేరాలు..!
ఏపీ రాజధాని అమరావతిలో ఇవాళ సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. వీటిలో పలు భూకేటాయింపులు, కొత్త ప్రాజెక్టులకు ఆమోదాలు, స్పెషల్ టీచర్ పోస్టులకు ఆమోదంతో పాటు మరికొన్ని నిర్ణయాలు కూడా ఉన్నాయి. వీటి వివరాలను మంత్రులు పార్ధసారధి, నాదెండ్ల మనోహర్ మీడియాకు వివరించారు. కేబినెట్ ఇవాళ తీసుకున్న నిర్ణయాలు ఇలా ఉన్నాయి.
రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు మీటింగ్లో M/s. డెక్కన్ ఫైన్ కెమికల్స్, M/s. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, M/s. PUR ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, M/s. బ్లూ జెట్ హెల్త్కేర్ లిమిటెడ్, M/s.జూపిటర్ రెన్యూవబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పెట్టుబడి ప్రతిపాదనలకు సంబంధించి సిఫారసులపై కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ఐదు కంపెనీల ద్వారా రాష్ట్రంలో రూ.9,246 కోట్లు పెట్టుబడులకు అవకాశం కలగనుంది. అలాగే 7,766 మందికి ఉద్యోగాలు వస్తాయి. దీంతో పాటు ఎస్ఐపీపీ తీసుకున్న ఇతర నిర్ణయాలకూ కేబినెట్ ఆమోదం తెలిపింది.

అలాగే ఆంధ్రప్రదేశ్ లెదర్ & ఫుట్వేర్ పాలసీ (4.0)- 2024-30 ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. భోగాపురం గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధికి M/s GVIAL 500 ఎకరాల భూమిని పునరుద్ధరించాలని చేసిన అభ్యర్థనకు మంత్రుల బృందం అంగీకారం తెలుపుతూ చేసిన సిఫారసుల్ని కేబినెట్ ఆమోదించింది. విశాఖ బీచ్ రోడ్లో తాజ్ గేట్ వే పున:అభివృద్ధి కోసం 5-స్టార్ డీలక్స్ హోటల్ కమ్ సర్వీస్ అపార్ట్మెంట్స్ గా మార్చేందుకు M/s వరుణ్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్, విశాఖపట్నానికి ప్రోత్సాహకాలకు పెట్టుబడుల బోర్డు ఇచ్చిన ప్రతిపాదనలు ఆమోదించింది.
తిరుపతిలో IBIS స్టైల్స్ 3-స్టార్, నోవోటెల్ 5-స్టార్ క్లస్టర్ హోటల్ అభివృద్ధి కోసం M/s శ్రవంతి హోటల్స్ & రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, బెంగళూరు వారికి ప్రోత్సాహకాలు అందించడానికి రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (SIPB) తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే ఎస్వీపురం వడమాలపేట వద్ద 5-స్టార్ రిసార్ట్ల అభివృద్ధి కోసం M/s బెంగాల్ అల్టిమేట్ రిసార్ట్స్ LLP, ఒడిశాకు భూమి కేటాయింపు, ప్రోత్సాహకాలకు పెట్టుబడుల బోర్డు నిర్ణయానికి ఆమోదం తెలిపారు. ఏలూరు జిల్లా అగిరిపల్లి మండలం తోటపల్లి గ్రామంలో M/s. నితిన్ సాయి కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ 20 TPD కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ను ఏర్పాటు చేసిన అభ్యర్థనపై ఇంధన శాఖ చేసిన ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు.

వైఎస్ఆర్ జిల్లాలోని గంగదేవిపల్లి, నల్లబల్లి ప్రాంతాల్లో 260 మెగావాట్ విండ్ సోలార్ హైబ్రిడ్ పవర్ కెపాసిటీని M/s. అంప్లస్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ గ్రూప్ కంపెనీలకు బదిలీ చేయడానికి M/s. ఎకోరెన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ చేసిన అభ్యర్థనపై ఇంధన శాఖ చేసిన ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. ఎంప్లస్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కడప జిల్లాలో విండ్-సోలార్ హైబ్రిడ్ పవర్ ప్రాజెక్ట్ను నెలకొల్పనుంది. అనంతపురం, శ్రీ సత్య సాయి జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో M/s బొండాడ ఇంజనీరింగ్ లిమిటెడ్ సంస్థ 2000 మెగావాట్ సౌర విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు చేసిన అభ్యర్థనను ఆమోదించారు.
అనంతపురం మరియు శ్రీ సత్య సాయి జిల్లాల్లోని రాళ్ల అనంతపురం మరియు కురుబరహల్లి ప్రాంతాల్లో M/s. ఎకోరెన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన 300.30 మెగావాట్ విండ్ పవర్ ప్రాజెక్ట్ను M/s. దేశ్రాజ్ సోలార్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్కు బదిలీ చేయడానికి చేసిన అభ్యర్థనపై ఇంధన చేసిన ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IIULER) సంస్థను బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ద్వారా అమరావతిలో ఏర్పాటుకు చేసిన నిర్ణయాన్ని కేబినెట్ ఆమోదించింది.
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ చట్టం, 1982 లోని సెక్షన్ 3 యొక్క సబ్-సెక్షన్ (4) ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు సమీపంలో యూనివర్సిటీ ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి నోటిఫికేషన్ జారీకి ఉన్నత విద్యాశాఖకు అనుమతించింది. రాజమండ్రిలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికై నోటిఫికేషన్ జారీకి కూడా అనుమతి ఇచ్చారు. 2260 స్పెషల్ టీచర్ పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపారు. రెవెన్యూ, ఇతర అధికారులు అమలు చేసే రద్దు డీడ్లపై రిజిస్ట్రేషన్ ఫీజు, యూజర్ ఛార్జీలకు మినహాయింపు ఇవ్వడానికి రెవిన్యూ శాఖ చేసిన ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు.
వైఎస్సార్ జిల్లాలోని K.బొమ్మెపల్లి గ్రామంలో వెయ్యి మెగావాట్ పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ స్థాపనకు ఎకరానికి 5 లక్షల చొప్పున 41.99 ఎకరాల ప్రభుత్వ భూమిని 2.09 కోట్లకు,శ్రీ సత్య సాయి జిల్లా పెద్దకొల్ల గ్రామంలో 500 మెగావాట్ పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అభివృద్ధికి ఎకరానికి 5 లక్షల చొప్పున 12.87 ఎకరాలకు రూ. 64.35 లక్షలకు ఆదానీ పవర్ కు ఇవ్వాలని నిర్ణయించారు. నెల్లూరు జిల్లా ముతుకు మండలం పైనాపురం గ్రామంలో పారిశ్రామిక పార్కు స్థాపనకు 615.98 ఎకరాల భూమిని ఏపీఐఐసీకి ఉచితంగా కేటాయించడానికి ఆమోదం తెలిపారు.
కర్నూలు జిల్లాలోని బి.తంద్రపాడు గ్రామంలో ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణం కోసం 5 ఎకరాల భూమిని కార్పొరేషన్ కి ఇవ్వడానికి గుంటూరు ఈఎస్ఐ ఆసుపత్రి స్థాపనకై అనుసరించిన విదానాన్నే అనుసరిస్తూ 5 ఎకరాల భూమిని ఉచితంగా ఇవ్వనున్నారు.
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకర్గంలో 2022లో రాజకీయ కారణాలతో జరిగిన ఘర్షణల్లో చనిపోయిన తోట చంద్రయ్య కుమారుడైన తోట వీరాంజనేయులుకు శాశ్వత ఉద్యోగం కల్పించాలని నిర్ణయించారు. చిత్తూరు జిల్లాలోని పలమనేరు రెవెన్యూ డివిజన్ నుండి పుంగనూరు, చౌడేపల్లి, సోమల, సదుం మండలాలను, చిత్తూరు జిల్లాలోని చిత్తూరు రెవెన్యూ డివిజన్ నుండి రొంపిచర్ల మండలాన్ని అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి రెవెన్యూ డివిజన్కు బదిలీ చేయాలని నిర్ణయించారు.
తిరుపతి జిల్లాలోని శ్రీసిటీలో డైకిన్ కంపెనీ ఎయిర్ కండిషనింగ్ తయారీ సౌకర్యాన్ని విస్తరించడానికి ఆమోదం తెలిపారు. అలాగే
క్వాంటం వ్యాలీ ప్రాజెక్టు ఏర్పాటుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు M/s IBM, M/s TCS మరియు M/s L&T మధ్య కుదుర్చుకున్న మూడు అవగాహన ఒప్పందాలను ధ్రువీకరించారు.రవాణా వాహనాలకు సంబంధించి గ్రీన్ ట్యాక్స్ రేటును తగ్గించడానికి మోటార్ వాహనాల చట్టంలో సవరణలకు ఆమోదం తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వివిధ కేటగిరీలలో 245 పోస్టుల కల్పనకు న్యాయ శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. రేషన్ సరకుల రవాణాకు ప్రస్తుతం వాడుతున్న వాహనాల స్ధానంలో తిరిగి రేషన్ షాపుల్నే వాడుకోవాలని నిర్ణయించారు. జూన్ 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. 66 ఏళ్లు దాటిన వారికి, దివ్యాంగులకు మాత్రం ఇంటి వద్దే రేషన్ ఇస్తారు.












Click it and Unblock the Notifications