రాజధానిపై బాబు 'బడా' ప్లాన్, జపాన్, సింగపూర్‌లకు చెరో బాధ్యత!
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధానిని మహానగరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం అన్నారు. రాజధానిలో 70 లక్షలకు పైగా జనాభాను అంచనా వేస్తున్నారు. జూన్ మొదటి వారానికల్లా ప్రధాని ప్రణాళిక రానుంది. ఎనిమిది చదరపు కిలో మీటర్ల పరిధిగి సింగపూర్ సహకారం ఉండనుంది. మిగిలిన దశలకు జపాన్, సింగపూర్ సాయం చేయనుంది.
చంద్రబాబు సోమవారం నాడు సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌తో భేటీ అయ్యారు. మూడు దశల్లో మాస్టర్ ప్లాన్ ఉంటుందని ఈశ్వరన్ చెప్పారు. రాజధాని అభివృద్ధి బాధ్యత సింగపూర్‌దని, సీఆర్డీఏ పరిధి అభివృద్ధి బాధ్యత జపాన్ సంస్థదని చంద్రబాబు చెప్పారు. ఫిబ్రవరిలో తొలి దశ, ఏప్రిల్ నెలాఖరులో రెండో దశ, జూన్ మొదటి వారంలో మూడో దశ ఉంటుంది.

ప్రపంచస్థాయి నగరంగా డిజైన్ చేయనున్నారు. జూరాంగ్, సుహానా సంస్థలకు మాస్టర్ ప్లాన్ బాధ్యతలు ఇచ్చారు. ఈశ్వరన్‌తో చంద్రబాబు దాదాపు మూడు గంటల పాటు భేటీ అయ్యారు. రాజధాని నిర్మాణానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్‌ను మూడు దశల్లో రూపొందించి ఇస్తామని, ఎనిమిది చదరపు కిలోమీటర్ల పరిధిలో కోర్ కేపిటల్ ఉంటుందని
సింగపూర్ మంత్రి ఈశ్వరన్ తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి మొదటి పక్షం ముగిసే సమయానికి తొలి దశ, ఏప్రిల్ నెలాఖరుకు రెండో దశ, జూన్ మొదటి వారానికి మూడో దశ ప్లాన్‌లు సిద్ధం చేసి ఇస్తామని వెల్లడించారు. ఆదివారం రాత్రి హైదరాబాద్ చేరుకున్న ఈశ్వరన్ బృందం సోమవారం సచివాలయంలో సీఎం చంద్రబాబుతో భేటీ అయింది.
రాజధాని నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ రూపకల్పన, ఎనిమిది చదరపు కిలోమీటర్ల పరిధిలో కోర్ కేపిటల్‌లో భవన నిర్మాణాలు, మొత్తం రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ రూపురేఖలు, ప్రపంచస్థాయి నగరంగా రూపుదిద్దడం, పారిశ్రామిక అభివృద్ధి, ఆదాయ వనరులను సృష్టించడం తదితర అంశాలపై సమగ్రంగా, సుదీర్ఘంగా చర్చించారు.
అనంతరం చంద్రబాబుతో కలిసి ఈశ్వరన్ విలేకరులతో మాట్లాడారు. తమ మాస్టర్ ప్లాన్ ఎలా ఉందనే అంశంపై ఏపీ ప్రభుత్వానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చామని చెప్పారు. చంద్రబాబుతో తమకు ఎంతో కాలంగా ఉన్న సత్సంబంధాలను దృష్టిలో పెట్టుకుని, నూతన రాజధాని నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు అంగీకరించామన్నారు. ఏపీ, సింగపూర్ ప్రభుత్వాల మధ్య ఎంవోయూలు కుదుర్చుకున్నామన్నారు.
ఈ ఒప్పందాల్లో భాగంగా జురాంగ్, సుహానా సంస్థలకు మాస్టర్ ప్లాన్ రూపకల్పన బాధ్యతను అప్పగించామని ఈశ్వరన్ వివరించారు. సింగపూర్ ప్రభుత్వానికి చెందిన ఇంటర్నేషనల్ ఎంటర్ ప్రైజెస్ సంస్థ ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తుందని తెలిపారు. స్మార్ట్ సిటీల ఏర్పాటుపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటన చేయడం.. అంతలోనే చంద్రబాబు తమ దేశానికి వచ్చి రాజధాని నిర్మాణానికి డిజైన్ చేయాల్సిందిగా కోరడంతో తాము ఉత్సాహం చూపించామన్నారు.
రాజధాని అంటే నాలుగు భవనాలను నిర్మిస్తే సరిపోదని, అన్ని రకాల హంగులతో అంతర్జాతీయ గుర్తింపు పొందే ప్రపంచస్థాయి నగరమని చంద్రబాబు తెలిపారు. ప్రపంచ కంపెనీలన్నీ నవ్యాంధ్ర రాజధానిలో పెట్టుబడులు పెట్టేలా ప్రణాళికలు రచిస్తున్నామన్నారు.
సీఆర్డీఏ పరిధిలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి..? ఆర్థికంగా పరిపుష్టి సాధించడం, పారిశ్రామికవేత్తలను ఆకర్షించడం.. తద్వారా పరిశ్రమల ఏర్పాటు.. ఉపాధి కల్పన, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడం, సందర్శకులను ఆకట్టుకోవడం.. వాటితో సంపదను సృష్టించడం వంటి తదితర అంశాలపై మాస్టర్ ప్లాన్ ఉంటుందని, దీనిపై భారీ కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు.
సింగపూర్ సంస్థలు కోర్ కేపిటల్‌ను అభివృద్ధి చేసి ఇస్తే.. సీఆర్డీఏ పరిధిని జపాన్ సంస్థలు అభివృద్ధి చేస్తాయన్నారు. సీఆర్డీఏ పరిధిలో పెట్టుబడులు పెట్టి పరిశ్రమలను అభివృద్ధి చేసే మాస్టర్ ప్లాన్‌ను జపాన్ ఇస్తుందన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు కూడా జపాన్ సహకరిస్తుందన్నారు.
పరిపాలన సౌలభ్యం, ప్రజలకు ప్రభుత్వం అందుబాటులో ఉండేందుకు వీలుగా ఈ ఏడాది జూన్, జూలై నాటికి విజయవాడ, గుంటూరుల్లో తాత్కాలిక ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు వివరించారు. వీటన్నిటినీ ప్రీ ఫ్యాబ్రికేటెడ్ పద్ధతిలో నిర్మిస్తామని చెప్పారు.
విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిల్లో మంగళవారం సింగపూర్ బృందంతో కలిసి పర్యటిస్తామన్నారు. విశాఖలో పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతామన్నారు. అక్కడి నుంచి విజయవాడ వెళ్లి రాజధాని మాస్టర్ ప్లాన్‌పై మరోసారి చర్చిస్తామని తెలిపారు. తిరుపతి వెళ్లి శ్రీవారి దర్శనం అనంతరం, సంక్రాంతి సంబరాలను ప్రారంభిస్తామని అన్నారు.












Click it and Unblock the Notifications