Chandrababu: ఐఏఎస్, ఐపీఎస్ లకు చంద్రబాబు హెచ్చరికలు..! తొలిరోజే క్లాస్..
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు వ్యవహరించిన తీరుపై ఇవాళ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక ఇవాళ తొలిసారి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. అంతే కాదు రాబోయే రోజుల్లో తన పాలన ఎలా ఉండబోతోందో వారికి హింట్ కూడా ఇచ్చేశారు.
ఇవాళ పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల తో సీఎం చంద్రబాబు కాసేపు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో
గత ఐదేళ్ళ లో కొంతమంది అధికారుల వైఖరి తనను బాధించిందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇలా వ్యవహరిస్తారని ఎప్పుడూ అనుకోలేదన్నారు. తాను గతంలో పలుమార్లు సీఎంగా ఉన్నా ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదని గుర్తుచేసుకున్నారు.
గత ఐదేళ్ళలో తాము వ్యవహరించిన తీరుపై ఐఏఎస్, ఐపీఎస్ లు ఆత్మ సమీక్ష చేసుకోవాలని వ్యాఖ్యానించారు.
అలాగే మరోమారు శాఖల వారీగా ఐఏఎస్ , ఐపీఎస్ లతో సమావేశం అవుతానని వారికి చంద్రబాబు స్పష్టం చేశారు.

ఐఏఎస్, ఐపీఎస్ లతో భేటీలో చంద్రబాబు గత ఐదేళ్లలో వారు వ్యవహరించిన తీరుపై సున్నితంగా హెచ్చరించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వారు వివిధ సందర్భాల్లో ఎలా వ్యవహరించారో పరోక్షంగా గుర్తుచేసినట్లు సమాచారం. తద్వారా రాబోయే రోజుల్లో వారు ఎలా వ్యవహరించాలో హింట్ ఇచ్చేశారు. అలాగే గత తప్పిదాలను సమీక్షించుకుని వారు మారాలని చంద్రబాబు తేల్చిచెప్పేశారు. ఇప్పటికే గత వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరించిన పలువురు ఐఏఎస్, ఐపీఎస్ లను కూటమి ప్రభుత్వానికి దూరం పెట్టేశారు.












Click it and Unblock the Notifications