ఆ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ గా చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించే పనిలో ఉన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఇక ఇదే విషయాన్ని ఏపీ మంత్రి టీజీ భరత్ కూడా స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎం చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అంటూ రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ స్పష్టం చేశారు.
మా లక్ష్యం అదే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం పని చేస్తుందని, ఈ విషయంలో తమ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలు పెట్టుబడి పెట్టేందుకు కావలసిన అనుకూల వాతావరణాన్ని ఏర్పరుస్తుందని ఆయన అన్నారు. రాష్ట్రానికి పెట్టబడులు తీసుకురావడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.

రాయితీలు, అనుకూల వాతావరణం
విశాఖపట్నంలోని నోవోటెల్ హోటల్‌లో ఆయన పారిశ్రామికవేత్తలు, వ్యాపార ప్రముఖులు, సీఐఐ సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలను కోరినట్లు మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఏపీలో పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలకు మెరుగైన రాయితీలు ఇవ్వడంతో పాటు పరిశ్రమలకు అనుకూల వాతావరణం కల్పించేందుకు ముందుంటామని ఆయన స్పష్టం చేశారు.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై పాలసీ
వ్యాపారాన్ని సులభతరం చేయడం ( ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ) పై త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో చర్చించి పాలసీని తయారుచేస్తామని మంత్రి టి.జి భరత్ అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లడంతో పాటు యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఏపీలో సంపద సృష్టికి కావాల్సిన అన్ని వనరులు ఉన్నాయన్నారు.

చంద్రబాబు సీఎం అయ్యాకే ఏపీకి పెట్టుబడులు
చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయ్యాకనే పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు మంత్రి టి.జి భరత్ పేర్కొన్నారు. ఏపీలో బిజినెస్ చేసే వారికి ప్రభుత్వం నుంచి అన్ని విధాల ప్రోత్సాహం ఉంటుందని చెప్పిన టీజీ భరత్, పరిశ్రమల శాఖ మంత్రిగా ఏపీలో పారిశ్రామిక ప్రగతి కోసం తన వంతు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో పారిశ్రామికవేత్తలు, సీఐఐ సభ్యులు, చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications