Praja Vedika: జగన్ కూల్చేసిన ప్రజావేదికపై చంద్రబాబు కీలక నిర్ణయం..!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అప్పటి విపక్ష నేత చంద్రబాబు నాయుడు అంతకు ముందు నిర్మించిన ప్రజా వేదికను కూల్చేసింది. ఉండవల్లి కరకట్టపై చంద్రబాబు ఇంటి పక్కనే ఉన్న ప్రజావేదికను కూల్చేసిన జగన్ సర్కార్ .. దాని శిథిలాలను కూడా అక్కడ నుంచి తొలగించకుండా అలాగే ఉంచేసింది. కక్షసాధింపు చర్యల్లో భాగంగా ప్రజావేదిక కూల్చివేతతో పాటు శిథిలాలను కూడా తొలగించకుండా ఐదేళ్ల పాటు అలాగే ఉంచేయడంపై అప్పట్లో విమర్శలు వచ్చాయి. అయినా ప్రభుత్వం మాత్రం పట్టించుకోలేదు.
కానీ ఇప్పుడు తిరిగి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ప్రజావేదికను తిరిగి నిర్మిస్తారనే అంచనాలున్నాయి. దీనిపై సీఎం చంద్రబాబు ఇవాళ మీడియాతో చిట్ చాట్ లో క్లారిటీ ఇచ్చేశారు. ప్రజావేదికను తిరిగి నిర్మించడం లేదని తేల్చిచెప్పేశారు. ప్రజావేదిక ఉండి ఉంటే వినతుల స్వీకరణకు అనువుగా ఉండేది, కానీ జగన్ ప్రజా వేదికను కూల్చి వేశారని గుర్తుచేశారు. కాబట్టి ప్రజావేదికను విధ్వంస పాలనకు ప్రతీకగా అలానే ఉంచబోతున్నట్లు స్పష్టం చేశారు. ఆ శిథిలాలను తొలగించబోమన్నారు.

రాష్ట్రంలో ప్రజల నుంచి ఫిర్యాదులు అందుకునేందుకు గతంలో సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు ప్రజా వేదికను వాడారు. ఆ తర్వాత వైసీపీ సర్కార్ దాన్ని కూల్చేసింది. దీంతో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఫిర్యాదులను సచివాలయం నుంచే స్వీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ప్రజా వేదికను తిరిగి నిర్మించేందుకు ఆసక్తి చూపడం లేదని అర్థమవుతోంది. దీంతో పాటు జగన్ విధ్వంస పాలనకు గుర్తుగా శిథిలాలను అక్కడే వదిలేయాలని నిర్ణయించడం మరో విశేషం.












Click it and Unblock the Notifications