సంక్రాంతి సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆసక్తికర సందేశం!!
సంక్రాంతి పండుగ సందర్భంగా రాజకీయ ప్రముఖులు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు శనివారం ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ఒక ప్రకటన విడుదల చేశారు.
సంక్రాంతి పండుగ అంటేనే అచ్చ తెలుగు పండుగ, గ్రామానికి నూతన శోభను తీసుకువచ్చే పండుగ, మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే పండుగ అని పేర్కొన్న ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి, పల్లెల పండుగ, రైతుల పండుగ, మన పాడిపంటల పండుగ అంటూ పేర్కొన్నారు. తమ స్వగ్రామాలకు తిరిగి వెళ్లి తమ కుటుంబ మరియు సాంస్కృతిక మూలాలకు విలువనిచ్చే పెద్ద పండుగ సంక్రాంతి పండుగ అని తెలియజేశారు.

భోగి మంటలు, రంగవల్లులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, గాలిపటాల సందళ్లు, పైరు పచ్చల కళకళలు, రైతు లోగిళ్ళలో ధాన్యపు రాశులు, పిండివంటల ఘుమఘుమలు, బంధుమిత్రుల సందడితో కనువిందు చేసే మనందరి పండుగ సంక్రాంతి పండుగ అని పేర్కొన్నారు. సంబరాల సంక్రాంతి ప్రతీరోజూ ప్రతీ ఇంట్లో ఉండాలని కోరుకుంటున్నామన్నారు.
ఈ 56 నెలల్లో ప్రతి గ్రామంలోనూ గ్రామ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థ, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్ లు, గవర్నమెంట్ ఆసుపత్రిలో నాడు నేడు, గవర్నమెంట్ బళ్ళు, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, అక్కడే కడుతున్న డిజిటల్ లైబ్రరీలు ఇలా ఎన్నో పనులు చేశామన్నారు.
ఒక్క రూపాయి కూడా లంచం, వివక్ష లేకుండా ప్రజలకు అందిన 2.46 లక్షల కోట్ల రూపాయల డీబీటీ, ఇంటింటికి ప్రతి పేద సామాజిక వర్గానికి చరిత్రలో ఎన్నడూ లేనంతగా అందిన లబ్ది , ఇవన్నీ పల్లెలు కళకళలాడటం కోసం ఎంతగానో ఉపయోగపడ్డాయని పేర్కొన్నారు.
ఇంటింటా, రాష్ట్రంలోని ప్రతి ప్రాంతంలోనూ, ప్రతి గ్రామంలోనూ, ప్రతి ఒక సామాజిక వర్గం లోనూ నిన్నటి కంటే నేడు, నేటి కంటే రేపు, రేపటి కంటే భవిష్యత్తులో మరింత అభివృద్ధి సాధించగలం అన్న భరోసా ఇవ్వగలిగితే ఇంటింటా సంక్రాంతి అని నమ్ముతూ, ఆచరిస్తున్న ప్రభుత్వంగా రాష్ట్ర ప్రజలందరికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు అని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications