అటానమస్ కాలేజీల్లో ప్రశ్నాపత్రాల తయారీ రద్దు, ఉద్యోగాలకు క్యాలెండర్: సీఎం జగన్ కీలక ఆదేశాలు
అమరావతి: విద్యా రంగంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అటానమస్ కాలేజీల్లో నిర్వహించే పరీక్షల విధానంలో మార్పులు చేయాలని ఆదేశించారు. గురువారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఉన్నత విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సతీష్ చంద్ర, ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయ్యర్ ఎడ్యుకేషన్ ఛైర్మన్ హేమచంద్రారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఏపీలోని అటానమస్ కాలేజీల్లో ప్రశ్నాపత్రాల తయారీ రద్దు
అటానమస్ కాలేజీల్లో పరీక్షల విధానంలో మార్పులు చేస్తున్నట్లు ప్రకటించారు. సొంతంగా ప్రశ్నాపత్రాలు తయారుచేసే విధానాన్ని రద్దు చేస్తున్నట్లు తెలిపారు. జేఎన్టీయూ తయారు చేసిన ప్రశ్నాపత్రాలు ఆయా కాలేజీల్లో వినియోగించాలని సూచించారు. నాన్ అటానమస్ కాలేజీలకూ ఇవే ప్రశ్నాపత్రాలు ఉంటాయని స్పష్టం చేశారు. పేపర్ వాల్యూయేషన్ కూడా జేఎన్టీయూకే అప్పగించాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. పరీక్షల్లో అక్రమాల నిరోధానికి చర్యలు తీసుకోవాలన్నారు.

డిగ్రీ సాధించాకే ఉద్యోగం వచ్చే పరిస్థితి ఉండాలన్న సీఎం జగన్
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. విద్యార్థి డిగ్రీ సాధించాక ఉద్యోగం వచ్చే పరిస్థితి ఉండాలని, నైపుణ్యం లేకుంటే ఇంటర్వ్యూ కూడా ఎదుర్కోలేమని చెప్పారు.
ప్రతి విద్యార్థీ నైపుణ్యంతోపాటు సబ్జెక్టుల్లో పరిజ్ఞానంతో ముందుకు రావాలన్నారు. ప్రతి కోర్సులో అప్రెంటిస్ విధానం తీసుకురావాలని, అందుకే నిర్ణయించామని సీఎం జగన్ చెప్పారు. విశాఖలో మంచి డిగ్రీ కాలేజీ తీసుకువచ్చి.. ఆర్ట్స్‌లో మంచి సబ్జెక్టులను ఈ కాలేజీలో ప్రవేశపెట్టాలని ఆదేశించారు.

జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన.. తల్లుల ఖాతాల్లో డబ్బులు
ఇక జగనన్న విద్యా దీవెన, వసతి దీవనపై సీఎం సమీక్షించారు. ఏప్రిల్ 9న జగనన్న విద్యా దీవన కింద ఫీజు రీఎంబర్స్‌మెంట్, ఏప్రిల్ 27న వసతి దీవెన విడుదలపై అధికారులతో చర్చించారు. ఈ ఏడాది నుంచి తల్లుల ఖాతాల్లో జగనన్న విద్యాదీవెన డబ్బులు, దాదాపు 10 లక్షల మందికిపైగా విద్యార్థులకు లబ్ధి కలగనుంది. ఈ ఏడాది డిగ్రీ అడ్మిషన్లలో 50వేల వరకూ పెరుగుదల వచ్చిందని తెలిపిన అధికారులు.

ఉగాది నుంచి ఉద్యోగాలకు క్యాలెండర్
ఈ సంవత్సరం భర్తీ చేయనున్న పోస్టులపై క్యాలెండర్ సిద్ధం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. ఉగాది రోజున క్యాలెండర్ విడుదల చేసేలా చూడాలన్నారు. ఈ ఏడాది 6 వేల మంది పోలీసు నియామకాలు చేయాలని ఆదేశించారు. ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనకు వీలైనంత త్వరగా నిధుల విడుదల చేయాలని సీఎం జగన్ ఆదేశించారు.












Click it and Unblock the Notifications