CMRF: సొంత పార్టీ ఎమ్మెల్యేకు సీఎంవో షాక్, నేరుగా బ్లాక్‌లిస్ట్ లోకి
కూటమి పార్టీ ఎమ్మెల్యేకు షాకిచ్చింది ఏపీ సీఎంవో. కీలకమైన పల్నాడు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే వరుస వివాదాలు, ఆయనపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో కఠిన నిర్ణయాన్ని తీసుకున్నారు సీఎం చంద్రబాబు. తాజాగా సదరు ఎమ్మెల్యే సొంత ఆస్పత్రినే లక్ష్యంగా చేసుకుని ముఖ్యమంత్రి కార్యాలయం ఇచ్చిన షాక్ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
పల్నాడు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యేకు డా. చదలవాడ అరవింద బాబుకు చెందిన 'అమూల్య నర్సింగ్ హోమ్' లో ఎలాంటి చికిత్సలు అందించకుండానే వందలాది నకిలీ బిల్లులు సృష్టించి ప్రభుత్వ నిధులను పక్కదోవ పట్టించినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. దీంతో సీఎంఆర్ఎఫ్ (CMRF), ఎల్ఓసీ (LOC) సేవలను తక్షణమే నిలిపివేసింది. అంతే కాకుండా సదరు ఆస్పత్రిని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని సీఎంవో సంచలన నిర్ణయం తీసుకుంది.

ముగ్గురు సూత్రధారులు.. 50 శాతం కమిషన్ల దందా!
ఈ దందా వెనుక ఎమ్మెల్యే వద్ద పీఏలుగా పనిచేస్తున్న బాజీ, చంద్ర, భపాసింహ అనే ముగ్గురు వ్యక్తులు ప్రధాన సూత్రధారులుగా వ్యవహరించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఆసుపత్రికి వచ్చే సీఎంఆర్ఎఫ్, ఎల్ఓసీ లబ్ధిదారుల నుంచి మొదట్లో 50 శాతం వరకు కమిషన్లు వసూలు చేసేవారు. ఆ తర్వాత మరింత ధనాశతో నకిలీ పత్రాలు, బిల్లులు సృష్టించి ప్రభుత్వం నుంచి రూ.లక్షలు కాజేసినట్లు తెలుస్తోంది. గతంలోనూ ఈ అక్రమాలపై వార్తలు వచ్చినప్పటికీ ఎమ్మెల్యే పట్టించుకోకపోవడం గమనార్హం.
ఎస్పీ ఆఫీస్‌లో ప్రత్యక్షమై 10 గంటల రచ్చ!
ఇటీవలే పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే చదలవాడ చేసిన రచ్చ యావత్ రాష్ట్రంలోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. లీగల్ అడ్వైజర్ పోస్టు నియామకంలో తాను చెప్పిన వ్యక్తి పేరును ఆమోదించలేదంటూ ఏకంగా ఎస్పీ ఛాంబర్‌లోనే 10 గంటల పాటు భీష్మించుకు కూర్చున్నారు. చివరికి ఛాంబర్లోని బాత్రూమ్లోకి వెళ్లి గడియ పెట్టుకోవడంతో, ఐజీ వచ్చి పోలీసులతో తలుపులు పగలగొట్టి ఆయన్ను బయటకు తీసుకురావాల్సి వచ్చింది. అధిష్ఠానం తీవ్రంగా పరిగణించడం, సీఎం చంద్రబాబు స్వయంగా ఈ వ్యవహారంపై అసహనం వ్యక్తం చేయడంతో ఎమ్మెల్యే క్షమాపణ కోరక తప్పలేదు.
ఎమ్మెల్యే పాత్రపై నిఘా.. క్రిమినల్ కేసులకు సిద్ధం!
పోలీస్ స్టేషన్ రాద్ధాంతం ముగిసి నెలలు గడవక ముందే, ఇప్పుడు ఏకంగా సొంత ఆసుపత్రిలోనే నకిలీ బిల్లుల కుంభకోణం వెలుగులోకి రావడం ఆయనను మరింత చిక్కుల్లో పడేసింది. ఈ దందాపై సమగ్ర విచారణ జరిపి తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సీఎంవో పోలీసులను ఆదేశించింది. ఈ అక్రమాల్లో ఎమ్మెల్యే పాత్ర ఎంతవరకు ఉందనే కోణంలోనూ, సదరు పీఏలతో పాటు నకిలీ బిల్లులకు సహకరించిన వైద్యులు, సిబ్బందిపై విచారణ జరిపేందుకు సిద్ధమవుతున్నారు. స్వపక్షానికి చెందిన ఎమ్మెల్యే ఆస్పత్రిలోనే ఆక్రమాలు జరుగుతున్నాయని తేలడంతో ప్రభుత్వం ఏమాత్రం ఉపేక్షించకుండా కఠిన చర్యలు తీసుకోవడం పల్నాడు జిల్లాలోనే కాక రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
నిజమైన లబ్ధిదారులకు నిరీక్షణ
ఆపద సమయంలో ఆర్ధికంగా ఆదుకునే సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇలా దుర్వినియోగం అవుతుంటే.. నిజంగా ఆపరేషన్లు చేయించుకుని డబ్బులు కోసం ఎదురుచూస్తున్న వారికి ఇదో శాపంలా మారింది. సాధారణంగా సీఎంఆర్ఎఫ్ కు అప్లై చేసుకున్న 90 రోజుల్లోనే అర్హులైన వారికి చెక్కులు మంజూరు చేయడం జరుగుతుంది. కానీ ఇలాంటి స్కాములు బయటపడుతున్న తరుణంలో.. రూ.5 లక్షల దాటిని బిల్లుల విషయంలో సీఎంవో చాలా జాగ్రత్తగా స్క్రూటినీ చేస్తుంది. ఫలితంగా దరఖాస్తు పెట్టుకున్న వారు ఐదు నెలలకు పైగా ఎదురుచూడాల్సిన పరిస్థితి నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఉంది














Click it and Unblock the Notifications
