సీఎం రిలీఫ్ ఫండ్ పై బిగ్ అప్డేట్.. మంత్రుల సిఫార్సులు లేనట్టే, కొత్త మార్గదర్శకాలు!
ఊహించని విధంగా తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు, ఏదైనా ప్రమాదాల బారిన పడినప్పుడు అత్యవసర వైద్య చికిత్సలు చేయడం చాలా ఖరీదుగా మారుతుంటాయి. అటువంటి సందర్భాలలో పేద, మధ్యతరగతి ప్రజలు ఆర్థికంగా చితికి పోతారు. అటువంటి వారికి అండగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధిని ఏర్పాటు చేసి సాయం అందిస్తుంది. వైద్య అత్యవసర పరిస్థితులలో బాధితులకు మేము అండగా ఉన్నామని చెబుతుంది.
సీఎంఆర్ఎఫ్ ఆన్ లైన్ దరఖాస్తుల విధానంలో మార్పులు
అయితే తాజాగా సీఎం రిలీఫ్ ఫండ్ పైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి సహాయనిధి కోసం అప్లై చేయాలంటే కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. గత రెండు సంవత్సరాలుగా సీఎంఆర్ఎఫ్ ఆర్థిక సహాయానికి సంబంధించి మొత్తం వ్యవస్థను ఆన్లైన్ విధానం ద్వారా చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ఇక తాజాగా ఆన్లైన్ దరఖాస్తు విషయంలో కొన్ని మార్పులను చేస్తూ నిర్ణయం తీసుకుంది.

నియోజకవర్గ చిరునామా ఉన్న అభ్యర్థులకు మాత్రమే సిఫార్సు
ఇప్పటివరకు మంత్రులు సీఎంఆర్ఎఫ్ విషయంలో రాష్ట్రంలో ఏ జిల్లాల వారికైనా అవసరమైతే సిఫార్సు చేసేవారు. ఇక అధికారాలను ప్రభుత్వం రద్దు చేసింది. ఇకపై ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గానికి చెందిన చిరునామా ఉన్న అభ్యర్థులకు మాత్రమే సిఫార్సు చేయాలని పేర్కొంది. సీఎంఆర్ఎఫ్ ఆన్లైన్ అప్లికేషన్లో ఆ విధంగా మార్పులు చేసినట్టు వెల్లడించింది. అంతేకాదు సీఎంఆర్ఎఫ్ చెక్ రి వాల్యుయేషన్ ప్రాసెస్ లో కూడా మార్పు చేపట్టింది .
గతంలో చెక్ లో మార్పులకు మ్యానువల్ విధానం, ఇప్పుడు నో ఛాన్స్
ఇంతకుముందు సీఎంఆర్ఎఫ్ చెక్ లో మార్పులు అవసరమైనప్పుడు మాన్యువల్ విధానం ఉండేది. ప్రస్తుతం ఈ ప్రక్రియను మార్చి దీనిని ప్రజాప్రతినిధుల లాగిన్ లో చేర్చింది. ఇకపై చెక్కులో మార్పులు కోరుకునేవారు సంబంధిత ప్రజాప్రతినిధి కార్యాలయానికి వెళ్లి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ప్రజా ప్రతినిధి కార్యాలయ సిబ్బంది దానిని సెక్రటేరియట్ లోని రెవిన్యూ డిపార్ట్మెంట్ కు పంపితే, ఆ తర్వాత కొత్త చెక్కు సంబంధిత ప్రజాప్రతినిధి కార్యాలయానికి చేరుతుంది.
తప్పుగా వివరాలిస్తే జాప్యం
తాజాగా ఈ విధంగా మార్పులు చేశారు.నిరుపేదల కోసం ప్రభుత్వం అందించే ముఖ్యమైన ఆర్థిక సహాయం కొన్ని కారణాల వల్ల జాప్యం జరుగుతుందని చెబుతున్న ప్రభుత్వం డీటెయిల్స్ అన్ని పక్కాగా ఇవ్వాలని సూచిస్తున్నది. మొబైల్ నెంబర్ తప్పుగా ఇవ్వడం, బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఆధార్ నెంబరు తప్పుగా నమోదు చేయడం, సీఎంఆర్ఎఫ్ చెక్కులను రెవిన్యూ డిపార్ట్మెంట్ నుంచి సకాలంలో తీసుకోకపోవడం, లబ్ధిదారులకు ఇవ్వకపోవడం జరుగుతుందని గుర్తించింది.
మంత్రుల పాత్ర తగ్గించిన తెలంగాణా ప్రభుత్వం
ఫిజికల్ డాక్యుమెంట్లు సమయానికి సమర్పించక పోవడం వంటి అనేక తప్పిదాలు జరుగుతున్నాయని వీటన్నిటినీ సరిగ్గా చూసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజా ప్రతినిధులకు సూచించింది. ఏది ఏమైనా మంత్రుల పాత్ర తగ్గిస్తూ, మంత్రులు కూడా తమ సొంత నియోజకవర్గాలకు మాత్రమే పరిమితమై, సీఎంఆర్ఎఫ్ సిఫార్సులు చేయాలని చెప్పడం తాజా మార్గదర్శకాలలో సుస్పష్టం.













Click it and Unblock the Notifications