అమరావతిలో శాశ్వత సెక్రటేరియట్ పై కీలక అడుగు..!
ఏపీలో రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో పట్టుదలగా ఉన్న కూటమి ప్రభుత్వం ఇవాళ కీలక అడుగు వేసింది. ఇప్పటికే రాజధాని అమరావతిలో ఏయే నిర్మాణాలు చేపట్టాలన్న అంశాన్ని ఖరారు చేసిన ప్రభుత్వం.. ఇవాళ వాటి విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. రాజధానికి అత్యంత కీలకమైన శాశ్వత సచివాలయ నిర్మాణం విషయంలో ప్రభుత్వం ఇవాళ తొలి అడుగు వేసింది. ఈ మేరకు సీఆర్డీయే నుంచి ప్రకటన వెలువడింది.
అమరావతి రాజధానిలో సచివాలయ టవర్ల నిర్మాణానికి సీఆర్డీఏ ఇవాళ టెండర్లు పిలిచింది. సచివాలయానికి 4 టవర్లు, హెచ్‌వోడీ కార్యాలయం నిర్మాణానికి టెండర్లు పిలిచారు. హెచ్‌వోడీ టవర్ నిర్మాణానికి రూ.1,126 కోట్లకు టెండర్ పిలిచారు. అలాగే సచివాలయం 1, 2 టవర్ల కోసం రూ.1,897 కోట్లతో మరో టెండర్ పిలిచారు. సచివాలయం 3,4 టవర్ల కోసం రూ.1,664 కోట్లతో ఇంకో టెండర్ జారీ చేసారు. మొత్తం 5 టవర్లను రూ.4,668 కోట్ల వ్యయంతో సీఆర్డీయే చేపట్టనుంది.

మే 1న సచివాలయ, హెచ్‍వోడీ టవర్లకు సీఆర్డీఏ టెక్నికల్ బిడ్లు తెరవనుంది. అనంతరం ఫైనాన్షియల్ బిడ్లు కూడా పూర్తి చేసి కాంట్రాక్టర్లకు వీటి నిర్మాణ బాధ్యతలు అప్పగించబోతోంది. దీంతో శాశ్వత సచివాలయం, హెచ్వోడీ కార్యాలయం నిర్మాణాలు పూర్తయిపోతాయి. త్వరలోనే మిగతా నిర్మాణాలకు కూడా టెండర్లు పిలిచేందుకు సీఆర్డీఏ సిద్ధమవుతోంది. ఈ మేరకు వరుస ప్రకటనలు రాబోతున్నట్లు తెలుస్తోంది. మే 2న ప్రధాని మోడీ రాకకు ముందే రాజధానిలో నిర్మాణాలపై క్లారిటీ రానున్నట్లు తెలుస్తోంది.
గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతిలో కీలక నిర్మాణాలు చేయలేకపోయారన్న విమర్శలు ఎదుర్కొన్న సీఎం చంద్రబాబు ఈసారి ఎట్టి పరిస్ధితుల్లోనూ రాజధాని నిర్మాణం పూర్తి చేసి ఎన్నికలకు వెళ్లాలని పట్టుదలగా ఉన్నారు. ఇందులో భాగంగా రెండో విడత భూసేకరణ లేదా సమీకరణకు కూడా సిద్దమవుతున్నారు. అమరావతిలో ఎయిర్ పోర్టు సహా ఇతర నిర్మాణాలన్నీ చేపట్టాలంటే భారీగా భూసేకరణ అవసరం ఉంది. త్వరలో వీటిపైనా కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు.












Click it and Unblock the Notifications