ఏపీలో ముందస్తు ఎన్నికలు ! జగన్ మళ్లీ సీఎం అవుతారా ? డిప్యూటీ సీఎం లెక్క ఇదే...
ఏపీలో ముందస్తు ఎన్నికలు తప్పవన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది అక్టోబర్ లో ముందస్తు ఎన్నికల షెడ్యూల్ వస్తుందని, డిసెంబర్లో తెలంగాణతో పాటే ఎన్నికలు జరగడం ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా సీఎం వైఎస్ జగన్ గుంభనంగా ఉంటూ ముందస్తు ఎన్నికలకు వెళ్లిపోతారని, కేసీఆర్ లా ప్రచారం చేసుకోరన్న అంచనాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో డిప్యూటీ సీఎం ఒకరు ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో ముందస్తు ఎన్నికలపై, అలాగే మరోసారి జగన్ ముఖ్యమంత్రి అవుతారా అన్నదానిపై డిప్యూటీ సీఎం నారాయణ స్వామి తన జోస్యం చెప్పేశారు. ఏపీలో ముందస్తు ఎన్నికలు రావని ఆయన స్పష్టం చేశారు. వైసీపీ సర్కార్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదని ఆయన తెలిపారు. ఎవరికో (ప్రతిపక్షాలకు) భయపడి ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం లేదని నారాయణ స్వామి పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం పూర్తికాలం అధికారంలో కొనసాగుతుందన్నారు.

మరోవైపు రాజధాని అమరావతిలో ఇళ్ల స్ధలాల వివాదం, అలాగే వైసీపీ సర్కార్ మరోసారి అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు కొనసాగిస్తారా లేదా, చంద్రబాబు వస్తే ఏం జరుగుతుందన్న దానిపైనా డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి మరోసారి అధికారం అప్పగిస్తే పథకాలు ఇలాగే కొనసాగుతాయని, అలా కాకుండా చంద్రబాబుకు అధికారమిస్తే పథకాలు తొలగిస్తారని డిప్యూటీ సీఎం హెచ్చరించారు.
ఏపీలో మరోసారి వైసీపీ గెలిచి సీఎం జగన్ పదవి చేపట్టడం ఖాయమని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి జోస్యం చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానాలూ అవసరం లేదన్నారు. తిరుమల దర్శనం చేసుకున్న తర్వాత బయటికి వచ్చి నారాయణ స్వామి ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో తాజాగా నెలకొంటున్న పరిణామాల నేపథ్యంలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.












Click it and Unblock the Notifications