ఏపీలో మళ్ళీ మూడు వేల టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ.. మంత్రి శుభవార్త!
ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగ యువతకు మరో శుభవార్త చెప్పింది కూటమి ప్రభుత్వం. ఇప్పటికే మెగా డీఎస్సీ ద్వారా టీచర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్న కూటమి సర్కార్ తాజాగా మళ్ళీ టీచర్ పోస్టుల భర్తీపై దృష్టి సారించింది.ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తాజాగా డీఎస్సీ ద్వారా మరో 3 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు.
రాష్ట్రస్థాయి క్లస్టర్ పాఠశాలల సమావేశంలో నారా లోకేష్ వెల్లడి
విజయనగరం జిల్లా దాసన్నపేట పాఠశాలలో శనివారం నిర్వహించిన రాష్ట్రస్థాయి క్లస్టర్ పాఠశాలల సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. విద్యా వ్యవస్థలో నాణ్యతను పెంచడంతో పాటు ఉపాధ్యాయుల సమస్యలను అర్థం చేసుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఇకపై ప్రతి నెలా ఒక నియోజకవర్గంలోని క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశంలో తాను పాల్గొంటానని చెప్పారు.

మార్పు విద్య ద్వారానే సాధ్యమన్న మంత్రి లోకేష్
సమాజంలో కావాల్సిన మార్పు విద్య ద్వారానే సాధ్యమని తాను బలంగా నమ్ముతున్నట్లు మంత్రి లోకేష్ పేర్కొన్నారు. విద్యార్థులకు మెరుగైన బోధన అందించేందుకు ఉపాధ్యాయులు అనుసరిస్తున్న ఉత్తమ పద్ధతులను తెలుసుకునేందుకు ఈ సమావేశం నిర్వహించినట్లు వివరించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల ఉపాధ్యాయులతో మాట్లాడి వారి బోధనా విధానాలను తెలుసుకున్నారు.
ఉపాధ్యాయులకు ప్రత్యేక టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్
పలు సూచనలు, అభిప్రాయాలను కూడా స్వీకరించారు. రాష్ట్రవ్యాప్తంగా 4,034 సముదాయాల ఉపాధ్యాయులు లైవ్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉపాధ్యాయులకు ప్రత్యేక టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహించే అంశం కూడా ప్రభుత్వం పరిశీలిస్తోందని మంత్రి లోకేశ్ తెలిపారు. ఈ విషయంపై ఉపాధ్యాయులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారు బోధనపై పూర్తి దృష్టి సారించాలని సూచించారు.
డీఎస్సీ ద్వారా 3 వేల పోస్టుల భర్తీ
ఏపీ ఉపాధ్యాయ సంఘాలు, రాష్ట్రోపాధ్యాయ సంఘాల ప్రతినిధులు చేసిన విజ్ఞప్తులపై స్పందించి లోకేష్ వారికి హామీ ఇచ్చారు. డీఎస్సీ ద్వారా 3 వేల పోస్టుల భర్తీ ప్రకటన నిరుద్యోగ అభ్యర్థుల్లో మరోమారు ఆశలు రేకెత్తిస్తోంది. పోస్టుల వివరాలు, అర్హతలు, పరీక్ష విధానం, దరఖాస్తు తేదీలపై అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఇప్పటికే మెగా డీఎస్సీపైన ప్రతిపక్షాలు టార్గెట్ చేస్తున్నాయి, అయినా మళ్ళీ డీఎస్సీ ప్రకటించి ఉద్యోగాల భర్తీ చేస్తామని లోకేష్ వెల్లడించారు.












Click it and Unblock the Notifications