Election Code: ఎంత డబ్బు మనతో తీసుకెళ్లొచ్చు? సీజ్ చేస్తే ఏం చేయాలి?
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఎన్నికల సంఘం నిబంధనలు అత్యంత కఠినంగా మారాయి. డిసెంబర్ 3 వరకు ఈ కోడ్ అమలులో ఉండటంతో పోలీసులు, ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీలను మరింత ముమ్మరం చేశారు. ఎన్నికల్లో అక్రమ డబ్బు, అక్రమంగా విలువైన లోహాల పంపిణీని అడ్డుకోవడమే లక్ష్యంగా అధికారులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల సమయంలో సామాన్య ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలంటే ఎన్నికల నిబంధనలపై పూర్తి అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యం.

ఎన్నికల నిబంధనల ప్రకారం ఎవరైనా వ్యక్తి ఎటువంటి సరైన ఆధారాలు లేకుండా బహిరంగంగా తమ వెంట తీసుకువెళ్లే నగదు పరిమితి కేవలం రూ.50,000 మాత్రమే. ఒకవేళ మీరు రూ.50 వేలకు మించి నగదును తీసుకెళ్లాల్సి వస్తే దానికి తగిన సరైన ఆధారాలు ఉండాలి. రైడ్ జరిగిన సమయంలో పోలీసులు మీ డబ్బు పట్టుకుంటే.. వ్యాపారులు తమ దైనందిన వ్యాపార లావాదేవీలకు సంబంధించిన బిల్లులు చూపించాలి. బ్యాంకు నుంచి డ్రా చేసుకున్నట్లు పాస్‌బుక్ లేదా రిసిప్ట్ వెంట ఉంచుకోవాలి. పంట అమ్మితే దానికి సంబంధించిన పత్రాలు చూపించాలి. అప్పుగా తీసుకుని వస్తే ప్రామిసరీ నోటు చూపించాలి. ఎలాంటి పత్రాలు లేకుండా రూ.50 వేలకు పైగా నగదు పట్టుబడితే అధికారులు తక్షణమే దానిని సీజ్ చేసే అవకాశం ఉంటుంది.
బంగారం తరలింపునకు ఉండాల్సిన నిబంధనలు ఏమిటి?
నగదుతో పాటు బంగారం లేదా వెండి వంటి విలువైన ఆభరణాల తరలింపుపై కూడా అధికారుల నిఘా ఉంటుంది. వ్యక్తిగతంగా ధరించిన ఆభరణాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే వ్యాపార నిమిత్తం లేదా పెళ్లిళ్ల కోసం భారీ ఎత్తున బంగారు ఆభరణాలను తరలించేటప్పుడు తగిన బిల్లులు, ట్యాక్స్‌కు సంబంధించిన రసీదులు, ఆభరణాల కొనుగోలు పత్రాలు తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది. ఎలాంటి బిల్లులు, ఆధారాలు లేకుండా భారీ మొత్తంలో బంగారం పట్టుబడితే అది అక్రమ రవాణా కింద లెక్కగట్టి అధికారులు సీజ్ చేస్తారు.
అధికారులు సీజ్ చేస్తే ఏం చేయాలి?.. విడిపించుకునే మార్గాలు
ఒకవేళ మీ వద్ద ఉన్న నగదు లేదా బంగారాన్ని ఎన్నికల అధికారులు సీజ్ చేస్తే ఎక్కడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అధికారులు దానిని తాలూకా లేదా జిల్లా స్థాయిలోని గ్రీవెన్స్ రిడ్రసల్ కమిటీకి అప్పగిస్తారు. మీరు పట్టుబడిన నగదు లేదా బంగారానికి సంబంధించిన సరైన బిల్లులు, ఆదాయపు పన్ను రిటర్నులు, వ్యాపార లావాదేవీల పత్రాలు లేదా పెళ్లి కార్డు వంటి బలమైన ఆధారాలను ఆ కమిటీ ముందు సమర్పించాలి. ఆ పత్రాలను పరిశీలించిన అధికారులు అవి చట్టబద్ధమైనవని నిర్ధారించుకున్నాక, ఎన్నికలు ముగిసిన అనంతరం మాత్రమే మీ నగదును లేదా బంగారాన్ని మీకు తిరిగి విడుదల చేస్తారు. ఇందులో కంప్లైంట్, ఎఫ్ఐఆర్ లాంటివి ఉండవు.














Click it and Unblock the Notifications
