కాక్రోచ్ దిష్టిబొమ్మ దహనంపై అభిజిత్ దిప్కే- సెటైరికల్ గా ఒక్క ముక్కలో.. !!
ఈ ఏడాది విజయదశమి వేడుకల సందర్భంగా దేశ రాజధానిలో ఓ వినూత్న ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. ప్రతి ఏటా దసరా పండుగ రోజున రావణాసురుడు, కుంభకర్ణుడు, మేఘనాథుడి భారీ దిష్టిబొమ్మలను దహనం చేయడం తరతరాలుగా వస్తున్న సంప్రదాయం. ఈసారి భారీ కాక్రోచ్ దిష్టిబొమ్మను కూడా దహనం కాబోతోంది. ఢిల్లీ పీతాంపుర రామ్ లీలా మైదాన్ లో దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి కూడా.
సమాజం, ఇళ్లు, పరిసరాల్లోనూ పేరుకుపోయిన మురికిని, అపరిశుభ్రతను అంతం చేయాలనే బలమైన సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికే ఈ ఏడాది నూతనంగా కాక్రోచ్ దిష్టిబొమ్మను దగ్ధం చేయాలని నిర్ణయించినట్లు శ్రీ కేశవ్ రామ్ లీలా కమిటీ ఇదివరకే వెల్లడించింది. దీనికి అనుగుణంగా రామ్ లీలా మైదాన్ లో ఈ ఉదయం ఆయా దిష్టిబొమ్మలను ఆవిష్కరించింది కూడా.

విజయదశమి పండుగ అనేది చెడుపై మంచి సాధించిన విజయాన్ని, అధర్మంపై ధర్మానికి కలిగిన గెలుపును చాటిచెప్పే పవిత్రమైన రోజని, అలాగే సమాజంలో, ఇళ్లల్లో బొద్దింకలు ఉండకూడదనే ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ ను రూపొందించినట్లు కమిటీ ఛైర్మన్, ఢిల్లీ మోడల్ టౌన్ బీజేపీ ఎమ్మెల్యే అశోక్ గోయెల్ దేవరహ చెప్పారు. యుగయుగాలుగా రావణ, కుంభకర్ణ, మేఘనాథుల ప్రతిమలను దహనం చేస్తూ వస్తోన్నామని, దీనివల్ల చివరికి సత్యమే జయిస్తుందనే సందేశాన్ని ఇస్తున్నామని గుర్తుచేశారు.
ఈ నిర్ణయంపై అభిజిత్ దిప్కే స్పందించారు. సెటైరికల్ గా తిప్పి కొట్టారు. కాక్రోచ్ దిష్టిబొమ్మను దగ్ధం చేయాలన్న నిర్ణయం వల్ల తమకేమీ నష్టం లేదని పరోక్షంగా పేర్కొన్నారు. పైగా దీనివల్ల తమకు దేశవ్యాప్తంగా ఉచితంగా ప్రచారం లభించినట్టవుతుందని వ్యాఖ్యానించారు. దీనికి థ్యాంక్స్ కూడా చెప్పారాయన. ఈ మేరకు థ్యాంక్యూ ఫర్ ద ఫ్రీ పబ్లిసిటీ.. అంటూ ట్వీట్ పెట్టారు. వార్తా సంస్థ ఏఎన్ఐ పోస్ట్ చేసిన వీడియో ట్వీట్ కు ఆయన రిప్లై ఇచ్చారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కాక్రోచ్ జనతా పార్టీ వివిధ సామాజిక అంశాలపై ఉద్యమాలను నిర్వహిస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. నీట్ పేపర్ లీక్ తర్వాత కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీనామా చేయాలనే డిమాండ్ పై ఆందోళనలను చేపట్టింది. ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే, నేహా బోరా, సౌరవ్ దాస్.. వంటి యువ నాయకులు దీనికి నాయకత్వాన్ని వహిస్తోన్నారు. ఈ పరిస్థితుల్లో కాక్రోచ్ దిష్టిబొమ్మను దగ్ధం చేయబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.














Click it and Unblock the Notifications
