జగన్ సర్కార్ పై గవర్నర్ కు ఫిర్యాదు-ఉద్యోగ నేతకు గుర్తింపు రద్దు హెచ్చరికలు!
ఏపీలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బకాయిల వ్యవహారం ఇవాళ మరో మలుపు తిరిగింది. ప్రభుత్వం తమకు డీఏ, జీపీఎఫ్, రిటైర్మెంట్ ప్రయోజనాల రూపంలో దాదాపు 12 వేల కోట్ల రూపాయలు బకాయిలు ఉందని, దాన్ని తమకు ఇప్పించాలని కోరుతూ ఇవాళ ఓ ఉద్యోగ సంఘం నేత గవర్నర్ ను కలిశారు. తాజాగా మరోసారి ఉద్యోగసంఘం నేతగా ఎన్నికైన మరో నేత సీఎం జగన్ ను కలిశారు. అనంతరం గవర్నర్ ను కలిసిన నేతకు హెచ్చరికలు జారీ చేశారు.దీంతో ఈ వ్యవహారం సంచలనం రేపుతోంది.
ఇవాళ ఉదయం ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత కేఆర్ సూర్యనారాయణ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను తమ సంఘం ప్రతినిధులతో కలిసి వెళ్లి విజయవాడ రాజ్ భవన్ లో కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు బాకీలు ఇప్పించాలని గవర్నర్ కు వినతిపత్రం ఇచ్చారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ విధిలేని పరిస్ధితుల్లోనే తాము గవర్నర్ ను కలవాల్సి వచ్చిందన్నారు. ప్రభుత్వం తమ బకాయిల విషయంలో దిగిరాకపోతే ఏప్రిల్ నుంచి ఆందోళనలు చేపడతామని హెచ్చరికలు చేశారు.

అనంతరం మధ్యాహ్నం ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైన బండి శ్రీనివాసరావు సీఎం జగన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. దీంతో జగన్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన బండి శ్రీనివాసరావు.. ఉదయం గవర్నర్ ను కలిసిన ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణపై మాటల దాడికి దిగారు. ప్రభుత్వాన్ని వెనకేసుకొస్తూ సాటి ఉద్యోగ సంఘం నేతపై నిప్పులు చెరిగారు. ఆయనకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

ఉద్యోగ సంఘాలు నిబంధనలు పాటించాలని, లేకపోతే వాటి గుర్తింపు రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుందన్న సంగతి గుర్తుపెట్టుకోవాలని కేఆర్ సూర్యనారాయణకు బండి శ్రీనివాసరావు హెచ్చరికలు చేశారు. సమస్యలపై పోరాటం చేసే సత్తా లేకే ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలు గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేశారన్నారు. వారి వెనుక ఏ శక్తి ఉండి నడిపిస్తుందో ఉద్యోగులు గమనిస్తున్నారని, ఇప్పటివరకూ మౌనంగా ఉన్నామని, ఇకపై ఇలాగే వ్యవహరిస్తే ఖబడ్డార్ అంటూ బండి హెచ్చరించారు. అన్ని సమస్యలు పరిష్కరిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారని, పరిష్కరించకపోతే తామూ ఉద్యమంలోకి వస్తామని బండి తెలిపారు.












Click it and Unblock the Notifications