తగ్గేదేలే; ఈనెల 5 నుంచి పెన్‌డౌన్.. 7 నుంచి సమ్మె : జగన్ సర్కార్‌కు ఉద్యోగుల అల్టిమేటం
ఏపీ ప్రభుత్వం తెచ్చిన కొత్త పీఈర్సీ జీవోలను రద్దు చేసే వరకు తమ ఆందోళనను విరమించేది లేదని ఉద్యోగులు, ఉపాధ్యాయులు తేల్చిచెప్పారు. తమ సత్తా ఏంటో "చలో విజయవాడ"తో ప్రభుత్వానికి చాటామన్నారు. ప్రభుత్వ కుట్రలు, పోలీసుల నిర్భందాలను చేధించి చలో విజయవాడను సక్సెస్ చేశామన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది బెజవాడకు తరలిచ్చారని పేర్కొన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మొండిపట్టు వీడి కొత్త పీఆర్సీ జీవోలను రద్దు చేసి తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ఈనెల 5 నుంచి సహయ నిరాకరణ ఉద్యమం
పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యమ కార్యాచరణలో భాగంగా తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తున్నట్లు ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి. ఉద్యమ కార్యచరణను వివరిస్తూ పీఆర్సీ సాధన సమితి ప్రతినిధి బొప్పరాజు సంచలన ప్రకటన చేశారు. ఈనెల 5 నుంచి సహయ నిరాకరణ ఉద్యమం ప్రారంభిస్తున్నట్లు జగన్ ప్రభుత్వానికి అల్టిమెటం జారీ చేశారు. ఏడవ తేది నుంచి సమ్మె నిర్వహించనున్నట్లు తెలిపారు. తాము చేపట్టే సమ్మె వలన ప్రజలకు ఏ మాత్రం అసౌకర్యం కలిగినా రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత అని తేల్చిచెప్పారు. తమ ఉద్యోగుల ఉద్యమం అంటే ఏంటో ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా చూపిస్తామని బొప్పరాజు హెచ్చరించారు..

ఉద్యోగుల ఉద్యమం ఒక చరిత్ర
రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఉద్యోగుల పట్ల చిన్న చూపు చూస్తున్నారని పీఆర్సీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్థరాత్రి 12 గంటల వరకు సచివాలయంలో వెయిట్ చేయించి అవమానం చేశారన్నారని మండిపడ్డారు. ఉద్యోగ సంఘాలుగా చర్చలకు వెళ్లకుంటే పరిపక్వత లేదంటారా..? దుయ్యబట్టారు. ఉద్యోగ సంఘాల సంఘాల వెనుక లక్షాలాది మంది ఉద్యోగులున్నారని పేర్కొన్నారు. విద్యుత్, ఆర్టీసీ ఉద్యోగులు కూడా తమ ఉద్యమంలోకి వస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ఇలాంటి పీఆర్సీ ప్రకటించడం చరిత్ర అయితే.. ఉద్యోగుల ఉద్యమం కూడా ఒక చరిత్రే అని అన్నారు.

ఉద్యోగులుగా తాము తగ్గేదేలే
ఉద్యోగులు, ఉపాధ్యాయల ర్యాలీతో బెజవాడ దద్దరిల్లిందని పీఆర్సీ సాధన ప్రతినిధి వెంకట్రామిరెడ్డి అన్నారు. తాము పాత పీఆర్సీ ప్రకారం జీతాలు వేయాలని ప్రభుత్వానికి ఎంత చెప్పినా వినకుండా కొత్త జీతాలు వేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాకు వచ్చే జీతాల పే స్లిప్పులు కూడా మాకు అర్థం కావా..? కేవలం ఐఏఎస్‌లకే పే స్లిప్పులు అర్థమవుతాయా..? అని నిలదీశారు. ఉద్యోగ సంఘ నేతలుగా తాము చేసిన పొరపాటు గుర్తించాం... దానిని సరిదిద్దుకున్నామన్నారు. సగటు ఉద్యోగికి న్యాయం చేసేందుకే ఈ ఉద్యమం అని అన్నారు. ఉద్యోగులుగా తాము తగ్గేదేలే అని వెంకట్రామిరెడ్డి అని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications