హైకోర్టుకు హాజరుకాని ఉద్యోగ నేతలు-ఢిల్లీలో సీఎస్-సమ్మె నోటీసుపై ఉత్కంఠ
ఏపీలో పీఆర్సీ వ్యవహారంపై హైకోర్టులో ఇవాళ జరిగిన విచారణ సందర్భంగా సమ్మె నోటీసు ఇచ్చేందుకు సిద్ధమైన ఉద్యోగసంఘాల నేతల్ని న్యాయస్ధానం తమ ముందు హాజరుకావాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఇవాళ మధ్యాహ్నం 2.15 గంటలకు ప్రారంభమైన విచారణకు వారు హాజరుకావాల్సి ఉంది. ఈ మేరకు విచారణకు హాజరుకావాలని సాధారణపరిపాలనశాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఫోన్ చేసి వారికి సమాచారం కూడా ఇచ్చారు. అయినా వారు విచారణకు మాత్రం హాజరుకాలేదు.
జీఏడీ సెక్రటరీ నుంచి చివరి నిమిషంలో ఫోన్ కాల్ రావడంతో విచారణకు హాజరుకాలేకపోతున్నట్లు ఉద్యోగసంఘాల నేతలు చెప్తున్నారు. విజయవాడలో ఉద్యమ కార్యాచరణ సమావేశాల్లో బిజీగా ఉన్న ఉద్యోగ నేతలు.. హైకోర్టు విచారణకు వెళ్లేందుకు సమయం సరిపోలేదని తెలుస్తోంది. అదే సమయంలో వారు సమ్మె నోటీసు ఇచ్చే విషయంపైనా సస్పెన్స్ కొనసాగుతోంది. వాస్తవానికి ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు వారు సచివాలయంలో సీఎస్ సమీర్ శర్మను కలిసి సమ్మె నోటీసు అందజేయాల్సి ఉంది. అయితే ఆయన కేంద్ర ప్రభుత్వ కార్యదర్శుల కమిటీ ఇవాళ ఢిల్లీలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లారు. అక్కడి నుంచి సాయంత్రం తిరిగి వచ్చే అవకాశాలున్నాయి. దీంతో ఉద్యోగులు ఎవరికి నోటీసులు ఇస్తారనే దానిపైనా ఉత్కంఠ కొనసాగుతోంది.

Recommended Video
మరోవైపు హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో సమ్మె నోటీసుపై ఉద్యోగసంఘాలు తీసుకునే నిర్ణయం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. ముందుగా అనుకున్న ప్రకారం వచ్చే నెల 7 నుంచి సమ్మె ప్రారంభించాలంటే మాత్రం 14 రోజుల గడువుతో నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ లెక్కన ఇవాళ నోటీసు ఇవ్వలేకపోతే సమ్మె షెడ్యూల్ లో మార్పులూ తప్పవు. దీంతో ఇవాళ ఏదో ఒక సమయంలో నోటీసు ఇచ్చేందుకు ఉద్యోగ సంఘాల నేతలు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమ కార్యాచరణను క్షేత్రస్ధాయిలో ఉద్యోగులకు చేరవేస్తున్న సంఘాల నేతలు.. సమ్మెపై వెనక్కితగ్గేందుకు మాత్రం ససేమిరా అంటున్నారు. మంత్రుల కమిటీ సమావేశానికి చర్చలకు రావాలని ప్రభుత్వం ఆహ్వానించినా వారు వెళ్లలేదు. దీంతో సమ్మె నోటీసుపై ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications