అమరావతిపై హైకోర్టు తీర్పు-సజ్జల రియాక్షన్ ఇదే...!
ఏపీ రాజధాని అమరావతిలో భూముల్ని పేదల ఇళ్ల స్ధలాల కోసం కేటాయిస్తూ వైసీపీ సర్కార్ తీసుకొచ్చిన ఆర్ 5 జోన్ ను హైకోర్టు ఇవాళ సమర్ధించింది. ఈ నేపథ్యంలో రైతులు దాఖలు చేసిన రెండు పిటిషన్లను కొట్టేసింది. దీంతో ఇన్నాళ్లు ఆర్ 5 జోన్ అక్రమం అంటూ రైతులు చేస్తున్న వాదనలో పస లేదని తేలిపోయింది. దీంతో ప్రభుత్వం కూడా ఇక ఇళ్ల స్ధలాల పంపిణీకి సిద్ధమవుతోంది. హైకోర్టు తీర్పుపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు.
హైకోర్టు ఇచ్చిన తీర్పు తమ విజయంగా ప్రభుత్వం భావించడం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. అడ్డంకులు సృష్టించే ప్రయత్నాన్ని కోర్టు అడ్డుకుందని తెలిపారు. అన్యాయమైన ఒక డిమాండ్ ను కోర్టు కొట్టిపారేసిందన్నారు. రాజకీయ దురుద్దేశాలతో అడ్డుకునే ప్రయత్నం చేశారని, కానీ రాజధాని అంటే ప్రజలు అందరూ ఉండే ప్రాంతం అని సజ్జల వివరించారు. కానీ జనాభా అసమతుల్యత అనే అన్యాయమైన వాదన తీసుకువవచ్చారని విమర్శించారు.

రాజధాని ప్రాంతంలో ఇళ్ల పట్టాల పంపిణీ త్వరలోనే ప్రారంభం అవుతుందని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. మూడు ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా అమరావతిలోనూ అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. చట్ట ప్రకారం ఐదు శాతం భూమిని పేదలకు కేటాయించాలన్న నిబంధనను గత టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని సజ్జల ఆరోపించారు. వైసీపీ సర్కార్ రాజధానిలోనూ పేదలకు ఇళ్లస్ధలాలు ఇవ్వడం ద్వారా న్యాయం చేయాలని భావించిందన్నారు.
అమరావతిలో ఇళ్ల స్ధలాల కేటాయింపు కోసం ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్ 45ను ఇవాళ హైకోర్టు సమర్ధించింది. రాజధాని కోసం తాము ఇచ్చిన భూముల్ని పేదల ఇళ్ల స్ధలాల పేరుతో పంచేస్తే జనాభా అసమతౌల్యత ఏర్పడుతుందన్న వాదనను తప్పుబట్టింది. రాజధాని ఏ ఒక్కరిది కాదని, పేదలను ఉండొద్దంటే ఎలా అని తీర్పు ప్రకటించిన ఛీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications