విజయవాడ, విశాఖ మెట్రో రైల్ పై మరో అప్డేట్-సర్కార్ కీలక నిర్ణయం..!
ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం వేగంగా అడుగులేస్తోంది. రాష్ట్రానికి కీలకమైన ఈ రెండు ప్రాజెక్టుల విషయంలో ఇప్పటికే టెండర్ల ఆహ్వనం సహా పలు నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వం.. వాటిని మరింత పక్కాగా అమలు చేసేలా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా టెండర్ సంస్థల నుంచి వచ్చిన వినతుల నేపథ్యంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
విజయవాడతో పాటు విశాఖలోనూ మెట్రో రైల్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం ప్రభుత్వం ఇప్పటికే టెండర్లు ఆహ్వానించింది. విశాఖ మెట్రో రైల్ ఫేజ్ 1 కింద 46.23 కిలోమీటర్ల మేర తొలిదశ నిర్మాణానికి టెండర్లు పిలిచారు. అలాగే విజయవాడ మెట్రో రైలు ఫేజ్ -1 లో 38 కిమీ నిర్మాణానికి టెండర్లు పిలిచారు. ఈ టెండర్ల కోసం నిర్వహించిన ప్రీబిడ్ మీటింగ్ లో కాంట్రాక్ట్ సంస్థలు పలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. వీటిని నివృత్తి చేయాల్సిన పరిస్ధితి ప్రభుత్వానికి ఏర్పడింది.

విజయవాడ, విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుల టెండర్ల ప్రీ బిడ్ మీటింగ్ లో కాంట్రాక్ట్ సంస్థల నుంచి వచ్చిన వినతుల పరిశీలన కొరకు గడువు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ ఎన్పీ రామకృష్ణా రెడ్డి ప్రకటన విడుదల చేశారు. విజయవాడ, విశాఖ మెట్రో రైల్ టెండర్లకు గడువు పొడిగించామని ఆయన తెలిపారు. విజయవాడ మెట్రో టెండర్ల గడువు అక్టోబర్ 14 వరకూ పొడిగించినట్లు ఆయన తెలిపారు. అలాగే విశాఖ మెట్రో టెండర్ల గడువు అక్టోబర్ 7 వరకూ పొడిగించామన్నారు.












Click it and Unblock the Notifications