జూన్ 7 నుంచి ఏపీ పదోతరగతి పరీక్షలు- వేసవి సెలవుల్లేవ్- జూలై 1 నుంచి కొత్త సంవత్సరం
ఏపీలో కరోనా కారణంగా విద్యాసంవత్సరంలో చోటు చేసుకున్న మార్పుల నేపథ్యంలో పదో తరగతి పరీక్షలతో పాటు ఇంటర్ మీడియట్ పరీక్షల విధానంలో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. తాజాగా నిర్ణయించిన షెడ్యూల్‌ను విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్ ఇవాళ విడుదల చేశారు. దీని ప్రకారం ఈ ఏడాది జూన్‌లో పదోతరగతి, ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. ఇవి ముగిసిన తర్వాత వెంటనే జూలైలో వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం కానుంది. సమాయాభావం కారణంగా ఈ ఏడాది వేసవి సెలవులు రద్దయ్యాయి.

ఈ ఏడాది పదోతరగతి పరీక్షల షెడ్యూల్
ఏపీలో ఈ ఏడాది పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్ ఇవాళ విడుదల చేశారు. దీని ప్రకారం జూన్ 7 తేదీ నుంచి 16వ తేదీ వరకూ పరీక్షలు నిర్వహించనున్నారు. మొత్తం ఏడు పేపర్లుగా పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుల భాషలతో పాటు గ్రూప్ సబ్జెక్టులకూ 100 మార్కుల చొప్పన ఉంటాయి. సైన్స్ మాత్రం రెండు పేపర్లు ఉంటాయి. వీటికి 50,50 మార్కులు కేటాయించారు. జూన్ 7వ తేదీన ఫస్ట్ లాంగ్వేజ్, 8న సెకండ్ లాంగ్వేజ్, జూన్ 9న ఇంగ్లీష్, జూన్ 10న గణితం, 11న భౌతిక శాస్త్రం, 12న జీవశాస్త్రం, 14న సోషల్ పరీక్షలు ఉంటాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకూ పరీక్షలు ఉంటాయి.

ఈసారి వేసవి సెలవుల్లేవ్
ఈ ఏడాది కోవిడ్ కారణంగా కోల్పోయిన కాలాన్ని గాడిన పెట్టేందుకు దశల వారీగా తరగతులు నిర్వహిస్తున్నట్లు విద్యాశాఖమంత్రి సురేష్ తెలిపారు. ఫిబ్రవరి 1 నుంచి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకూ అన్ని పాఠశాలలు యథావిథిగా పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ విద్యాసంవత్సరంలో జూన్ 5 వరకూ పాఠశాలలు పనిచేస్తాయన్నారు. ఈ లెక్కన చూస్తే 167 పనిదినాలు వస్తున్నాయని ఆయన వెల్లడించారు. మే 3 నుంచి 15 వరకూ 1 నుంచి 9వ తరగతి వరకూ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు విద్యామంత్రి తెలిపారు. ఈసారి విద్యాసంస్ధలకు వేసవి సెలవులు లేవని తెలిపారు. మే 16 నుంచి 31 మాత్రం రెండు వారాల సెలవులు ఇస్తామన్నారు.

జూలై 1 నుంచి కొత్త విద్యాసంవత్సరం
ఈ ఏడాది జూలై 1 నుంచి కొత్త విద్యాసంవత్సరం మొదలుపెట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈసారి కూడా 35 శాతం సిలబస్ తగ్గించాలని నిర్ణయం తీసుకున్నట్లు విద్యామంత్రి తెలిపారు. ఇందుకు అనుగుణంగా అన్ని మార్పులు చేస్తున్నామన్నారు. మరోవైపు ఈ ఏడాది మార్చి 31 నుంచి ఏప్రిల్ 24 వరకూ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఇంటర్ మొదటి ఏడాది సప్లిమెంటరీ పాస్ అయిన వారికి కూడా ఇంప్రూవ్ మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆదివారాలు కూడా ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ఉంటాయన్నారు. ఇంటర్ రెండో ఏడాది వారు కూడా అన్ని సబ్జెక్టులు ఇంప్రూవ్‌మంట్ రాసుకునేందుకు అవకాశం కల్పిస్తామన్నారు.