మరో బాదుడుకు జగన్ సర్కార్ రెడీ-ఎల్లుండి నుంచి చెత్తపన్ను-ఆ 45 నగరాలు, పట్టణాల్లో
ఏపీలో రెండేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం.. అప్పట్లో అధికారమిస్తే పన్నులు, ఛార్జీల పెంపు ఉండబోదని హామీ ఇచ్చింది. కానీ ఇప్పటికే కరెంటు ఛార్జీలతో పాటు ఆస్తిపన్ను పెంపును అమల్లోకి తెచ్చేసింది. ఇప్పుడు అదే కోవలో మరో కొత్త ఛార్జీల వసూలుకు సిద్దమవుతోంది. అదీ రాష్ట్రవ్యాప్తంగా ఏకీకృతంగా కాకుండా ఎక్కడికక్కడ మార్కెట్ ధరల ఆధారంగా ఈ ఛార్జీల్ని వసూలు చేయబోతోంది. దీనిపై ఇప్పటికే పురపాలక సంస్ధల్లో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం పట్టించుకునే స్ధితిలో లేదు.

ఏపీలో ఎల్లుండి నుంచి చెత్తపన్ను
ఏపీలో ఘన వ్యర్ధాల సేకరణ ద్వారా నగరపాలక సంస్ధలు, పురపాలక సంస్ధల్లో పారిశుద్ధ్యం మెరుగుపర్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్) పథకం పేరుతో ఆయా చోట్ల ఘన వ్యర్ధాల్ని సేకరించేందుకు ప్రత్యేక ఛార్జీల్ని వసూలు చేయబోతోంది. వీటి ద్వారా స్ధానిక సంస్ధలకు రాబడి పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. భారీ సంఖ్యలో ఉన్న స్ధానిక సంస్ధలకు నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వ ఖజానా సహకరించపోవడంతో ఇప్పుడు ఎక్కడికక్కడ చెత్తపన్ను వసూలు ద్వారా రాబడి పెంచుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. ఎల్లుండి ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించబోతోంది.

తొలిదశలో 45 కార్పోరేషన్లు, మున్సిపాలిటీల్లో
క్లాప్ పథకంలో భాగంగా తొలి దశలో రాష్ట్రవ్యాప్తంగా 45 కార్పోరేషన్లు, మున్సిపాలిటీల్లో ఘనవ్యర్ధాల సేకరణ ఛార్జీలు వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో 16 కార్పోరేషన్లతో పాటు 29 మున్సిపాలిటీలు ఉన్నాయి. తొలి దశలో ఒక్కో కార్పోరేషన్, మున్సిపాలిటీలో రెండేసి డివిజన్లు, వార్డుల చొప్పున ఈ పన్ను ప్రయోగాత్మకంగా వసూలు చేస్తారు. ఇలా 90 డివిజన్లు, వార్డుల్లో ఈ చెత్త పన్ను వసూళ్లు ప్రారంభం కానున్నాయి. వీటిలో ఎల్లుండి నుంచి స్ధానిక సంస్ధలు నిర్ణయించిన విధంగా ఘన వ్యర్ధాల సేకరణ ఛార్జీలు వసూలు చేస్తారు. ఈ మేరకు స్ధానిక సంస్ధల్లో తీర్మానాలు చేయాలని ఇప్పటికే పురపాలకశాఖ నుంచి కమిషనర్లకు ఆదేశాలు వెళ్లాయి. పలు చోట్ల తీర్మానాలు కూడా చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
రెండో దశలో మిగతా 68 మున్సిపాలిటీల్లో, నగర పంచాయతీల్లో చెత్త పన్ను వసూలు చేస్తారు.
Recommended Video

చెత్త పన్నుపై విమర్శల వెల్లువ
స్ధానిక సంస్ధల పరిధిలో ఘన వ్యర్ధాల సేకరణ ప్రభుత్వ బాధ్యత అయినప్పటికీ దాన్ని విస్మరించి ఛార్జీల వసూలుకు సిద్దం కావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమలు కోసం స్ధానిక సంస్ధల్లో తీర్మానాలు చేసి ఆమోదించాల్సి ఉంటుంది. ఇక్కడ విపక్షాలు చెత్తపన్నును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అయినా వైసీపీకి దాదాపు అన్ని కార్పోరేషన్లు, మున్సిపాలిటీల్లో మెజారిటీ ఉండటంతో చెత్తపన్నుపై తీర్మానాలు చేయడం అంత కష్టమేమీ కాదు. కానీ ప్రజాసంఘాలు, ప్రజల నుంచి చెత్త పన్నుపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.












Click it and Unblock the Notifications