ఏపీలో కొత్తగా 70 వేలకు పైగా పెన్షన్లు- జూన్ 12న పంపిణీ..!
ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత భారీ ఎత్తున పెన్షన్లను తొలగిస్తుందనే ఆరోపణలు వచ్చాయి. అయితే ప్రభుత్వం మాత్రం గతంలో పింఛన్ తీసుకుంటున్న లబ్దిదారుల్లో అనర్హుల్ని ఏరివేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చింది. ఈ ప్రక్రియ పూర్తి కావడంతో ఇప్పుడు కొత్త పెన్షన్ల పంపిణీ చేపడుతోంది. ఇందులో భాగంగా వచ్చే నెల నుంచి ఏకంగా 70 వేల మందికి పైగా కొత్తగా పెన్షన్ల పంపిణీకి సిద్దమవుతోంది.
ఎన్టీఆర్ భరోసా పథకం కింద ఇప్పటికే ఇస్తున్న వృద్ధులు, వితంతవులు, దివ్యాంగులతో పాటు స్పౌజ్ పేరుతో కొత్త కేటగిరీని ఏర్పాటు చేశారు. ఇప్పటికే పెన్షన్ తీసుకుంటున్న భర్త చనిపోతే ఆ పెన్షన్ భార్యకు ఇచ్చేలా ఈ కొత్త కేటగిరీని ఏర్పాటు చేశారు. దీని కింద ఏకంగా 71380 మందికి పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం తొలిసారి నిర్ణయించింది. ఈ మేరకు వచ్చే నెల నుంచి వీరికి పెన్షన్ పంపిణీ చేయబోతున్నారు. అయితే జూన్ 1న కాకుండా జూన్ 12న వీరికి ఈ పింఛన్ మొత్తాలు అందిస్తారు.

జూన్ 12న రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేసిన స్పౌజ్ కేటగిరీ కింద 71380 మందికి నాలుగు వేల రూపాయల చొప్పున పెన్షన్ అందించేందుకు వీలుగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అధికారులు ఇప్పటికే గుర్తించిన వీరికి జూన్ 12న పెన్షన్లను ఇంటివద్దే అందిస్తారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వంపై నెలకు 35 కోట్ల రూపాయల మేర భారం పడుతుందని అంచనా వేశారు. ఇప్పటికే రాష్ట్రంలో భారీ ఎత్తున ఇస్తున్న పెన్షన్ల కారణంగా రాష్ట్ర ఖజానాపై భారం అంతకంతకూ పెరుగుతూనే ఉంది.
వాస్తవానికి రాష్ట్రంలో ప్రస్తుతం ఆసరా పెన్షన్లు తీసుకుంటున్న లబ్దిదారులు చనిపోతే వారి కుటుంబ సభ్యులకు వాటిిని కొనసాగించే అవకాశం ఉండేది కాదు. దీంతో చనిపోయిన వారి పెన్షన్లను ప్రభుత్వం రద్దు చేసేది. కానీ ఇప్పుడు కుటుంబ సభ్యుల్లో భర్త పెన్షన్ తీసుకుంటూ చనిపోతే దాన్ని ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో భార్యకు వర్తింపచేసేలా స్పౌజ్ పెన్షన్ కేటగిరీనీ ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications