ఏపీ కరోనా టెస్టుల్లో మరో ముందడుగు-ఐమాస్క్ క్వారంటైన్ బస్సులు...మొబైల్ శాంపిల్స్
దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల్లో ముందంజలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీటిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం మరో ప్రయోగం చేస్తోంది. ఇప్పటికే కరోనా టెస్టుల కోసం స్ధానిక పీహెచ్‌సీలతో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం.. తాజాగా మొబైల్ క్వారంటైన్లను, మొబైల్ శాంపిల్ కలెక్షన్లను కూడా వాడుకోవాలని నిర్ణయించింది. వీటి ద్వారా వైరస్ వ్యాపించిన వారిని వేగంగా చేరుకోవడంతో పాటు పరీక్షల నిర్వహణ కూడా సులభతరం అవుతుందని భావిస్తున్నారు.
కరోనా శాంపిల్స్ సేకరణ, మొబైల్ క్వారంటైన్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన బస్సులకు ఐమాస్క్ గా నామకరణం చేశారు. ఇంటిలిజెంట్ మానిటరింగ్ అనాలిసిస్ సర్వీసెస్ క్వారంటైన్ గా (imasq) పిలిచే ఈ బస్సుల ద్వారా కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న ప్రాంతాల్లో వేగంగా శాంపిల్స్ సేకరణతో పాటు అవసరమైన వారికి మొబైల్ క్వారంటైన్ సేవలు కూడా అందించనున్నారు.

కృష్ణాజిల్లాలో ఇవాళ్టి నుంచి ప్రయోగాత్మకంగా పది బస్సులను ప్రభుత్వం ప్రారంభించింది. ఇవి జిల్లాలోని విజయవాడ, జగ్గయ్యపేట, నూజివీడు, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో పర్యటిస్తాయి. వీటిలో ఉండే సిబ్బంది విజయవాడలో కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న కృష్ణలంక, వన్ టౌన్ గాంధీ హైస్కూల్, ఇందిరాగాంధీ స్టేడియం, మాకినేని బసవపున్నయ్య స్టేడియం, సింగ్ నగర్, గుణదల మేరీమాత చర్చి, విజయవాడ రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో వీటిని అందుబాటులో ఉంచుతున్నట్లు కలెక్టర్ ఇంతియాజ్ ప్రకటించారు.
ఫ్లూ లక్షణాలైన దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతున్న వారు 9963112871 నంబరుకు కాల్ చేసి తమ పేర్లను నమోదు చేసుకుంటే కాల్ సెంటర్ ద్వారా వారికి ఎస్సెమ్మెస్ వస్తుంది. ఈ బస్సులు అందుబాటులో ఉన్న ప్రాంతాలకు వెళితే వెంటనే శాంపిల్స్ తీసుకుని పరీక్షలు నిర్వహించి ఫలితాలను చెప్పేస్తారు. ఫ్లూ తీవ్రతను బట్టి అవసరమైతే వీరిని బస్సుల్లోని క్వారంటైన్లలో ఉంచుతారు.












Click it and Unblock the Notifications