ఏపీలో రైతుల ఖాతాల్లోకి రూ.20వేలు...అమలు ఆరోజు నుంచే?
రాష్ట్రంలో అధికారం చేపట్టిన జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో తామిచ్చిన హామీలను అమలు చేయడానికి ప్రయత్నిస్తోంది. ప్రతి సంవత్సరం రైతులకు పెట్టుబడి సాయంకింద రూ.20వేలు అందిస్తామనే కీలక హామీని కూడా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు. అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హులైన రైతులకు రూ.20వేలు అందిస్తామన్నారు. జూన్ నాలుగోతేదీన ప్రభుత్వం ఏర్పాటైనప్పటికీ ఇప్పటివరకు దానిపై స్పష్టత రాలేదు.
వెంటనే ప్రారంభించాలని రైతన్నల డిమాండ్
ఈ పథకాన్ని ఎలా అమలు చేయబోతున్నారు? ఎవరెవరికి వర్తిస్తుంది? విధివిధానాలు ఏంటి? అన్న విషయాలేవీ తెలియరాలేదు. దీనిపై రాజ్యసభ మాజీ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డాక్టర్ తులసిరెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు. రైతులకు ఇవ్వాల్సిన రూ.20వేల హామీని ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం క్రమం తప్పకుండా పెట్టుబడి సాయాన్ని అందించిందని, ప్రస్తుత ప్రభుత్వం కూడా వెంటనే ఈ పథకాన్ని ప్రారంభించాలని అన్నదాతలు కోరుతున్నారు.

నివేదిక తయారైన తర్వాత అధికారిక ప్రకటన
గత ప్రభుత్వంలో లబ్ధిపొందిన రైతుల జాబితా ప్రభుత్వం వద్దే ఉంటుంది. ఆ డేటాను ఉపయోగించైనా వెంటనే పథకాన్ని ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు. వచ్చే దసరా పండగకు లేదంటే దీపావళి పండగకు ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇటీవలే వ్యవసాయశాఖపై సమీక్షా సమావేశం నిర్వహించిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పథకంపై అధికారులకు కొన్ని సూచనలు జారీచేశారు.
లబ్ధిదారులను గుర్తించేందుకు వారి ఫోన్ నెంబర్లను బ్యాంకు ఖాతాలకు లింకు చేయాలన్నారు. అంతేకాకుండా వీటిని జియో ట్యాగ్ చేయాలని సూచించారు. పీఎం కిసాన్ యోజన పథకం కింద కేంద్రం రూ.6వేలు అందిస్తోంది. దీనికి మరో రూ.14వేలు కలిపి మొత్తం రూ.20వేలు అందివ్వాలనే యోచనలో చంద్రబాబు ప్రభుత్వం ఉంది. లబ్ధిదారుల జాబితాపై పూర్తిస్థాయిలో నివేదిక తయారైన తర్వాత ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications