'అన్నదాతా సుఖీభవ' అర్హుల జాబితా - వారికే ఛాన్స్, తాజా నిర్ణయంతో..!!
ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం అమలు పైన తుది కసరత్తు చేస్తోంది. పీఎం కిసాన్ తో కలిసి ఈ పథకం మూడు విడతల్లో అమలు చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తొలుత ఈ నెల 20న పీఎం కిసాన్ తో పాటుగా తొలి విడత అన్నదాత సుఖీభవ నిధులు విడులకు వీలుగా ఆలోచన చేసింది. అయితే, పీఎం కిసాన్ నిధుల పైన కేంద్రం నుంచి ఇంకా స్పష్టత రాలేదు. దీని కారణంగా ఈ నెల 20న ఈ పథకం నిధుల విడుదల పైన ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. కాగా, ఇదే సమయంలో ఈ పథకానికి అర్హుల జాబితాలు సిద్ధమయ్యాయి.
అర్హుల జాబితా
అన్నదాతా సుఖీభవ పథకం ఎంపికలో ప్రభుత్వం అర్హుల ఖరారు పైన జిల్లాల నుంచి సమాచారం సేకరిస్తోంది. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతా సుఖీభవ పథకానికి 45,64,005 మంది రైతులు అర్హత సాధించినట్లు తెలిసింది. వారిలో 44,30,149 మంది రైతుల ఇకెవైసి పూర్తి కాగా.. 1,20,148 మందికి సంబంధించి ఇకెవైసి పెండింగ్ ఉంది. చివరి సారిగా 2024 జనవరిలో 53.58 లక్షల మంది రైతుల ఖాతాలో సొమ్ము జమ చేసింది. దీంతో పోలిస్తే ప్రస్తుతం 7.94 లక్షల మందికి తగ్గినట్లు తెలుస్తోంది. సాంకేతిక సమస్యలు, రెవెన్యూ చిక్కులు ఎదురవడంతో లక్షలాది మంది రైతుల వివరాలు పెండింగ్‌లో పెట్టినట్లు సమాచారం.

పెండింగ్ లో నిర్ణయం
ఇక.. గత వైసిపి ప్రభుత్వం లో చేపట్టిన భూ సమగ్ర సర్వే సందర్భంగా అనేక భూ సమస్యలు తలె త్తాయి. అవి ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉండడంతో అన్నదాతా సుఖీభవకు దరఖాస్తు చేసేందు కు ఆటంకంగా మారింది. ప్రధానంగా జాయింట్ ఎల్‌పిఎం (ల్యాండ్ పార్సిల్ మ్యాప్)లు, ఆధార్ అనుసంధానంలో తప్పిదాలు, మ్యుటేషన్లు, మరణించిన వారి పేర్లతో భూమి ఉండడం వంటి సమస్యలను కారణాలుగా చూపి నిరాకరించినట్లు తెలుస్తోంది. ఒకే రైతు పేరుతో అధిక విస్తీర్ణంలో భూమి చూపించడం, వెబ్‌సైట్‌లో ఒకరి సర్వే నంబరులో వేరొకరి భూమి నమోదు కావడం తదితర సమస్యలతో ముడిపడి ఉన్న రైతుల ఫిర్యాదులను పరిష్కరించాల్సి ఉంది. సుమారు రెండు నెలల పాటు లబ్ధిదారుల ఎంపికపై ప్రభుత్వం కసరత్తు సాగించింది.
తుది కసరత్తు
వ్యవసాయశాఖ కమిషనరేట్ నుంచి వచ్చిన వెబ్‌ల్యాండ్ డేటా ఆధారంగా అధికారులకు రైతులకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. తొలుత వ్యవసాయ అసిస్టెంట్లు (విఎఎ)లు, మండల వ్యవసాయశాఖ అధికారులు పరిశీలించి తమ పరిధిలోని అంశాల మేరకు అప్రూవల్ తెలిపారు. రెవెన్యూశాఖకు సంబంధించిన అంశాలను తహశీల్దార్ల లాగిన్‌కు పంపారు. తహశీల్దార్లకు పంపిన పెండింగ్ రికార్డులను మినహాయించి ప్రభుత్వం అప్రూవల్ అయిన మేరకు జాబితాను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వం డి పట్టా, ఆర్‌ఒఎఫ్‌ఆర్ సాగుదారులకు రైతు భరోసా వర్తింప జేసినా, అన్నదాతా సుఖీభవకు వారిని ప్రభుత్వం అర్హులుగా గుర్తిస్తుందా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది. వెబ్‌సైట్‌లో ఆ రైతుల భూములను ప్రభుత్వ భూములుగా చూపించడంతో అధికారులు వారిని పరిగణించటం లేదని సమాచారం. దీంతో లక్షలాది మంది రైతులు సాయానికి దూరం అయ్యే ప్రమాదం ఉందని.. వీరితో పాటుగా కౌలు రైతుల విషయంలోనూ ప్రభుత్వం ఏం చేయబోతుందనేది ఇప్పుడు రైతులు ఆసక్తిగా చూస్తున్నారు.












Click it and Unblock the Notifications