ఏపీలో వాహనదారులకు భారీ షాక్-అసెంబ్లీలో బిల్లు..!
ఏపీలో వాహనదారులకు ప్రభుత్వం (AP Govt) భారీ షాక్ ఇచ్చింది. ఇక రాష్ట్రంలో రోడ్డెక్కాలంటేనే భయపడేలా వాహనాలపై అదనంగా మరో పది శాతం సెస్ పెంచేందుకు వీలుగా మోటారు వాహనాల చట్టంలో సవరణలు చేస్తూ బిల్లును అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీంతో ఇప్పటికే పన్నులు, సెస్ ల మోతతో సతమతం అవుతున్న రాష్ట్ర వాహనదారులకు ఈ 10 శాతం సెస్ (road cess) మరింత భారంగా మారబోతోంది. ప్రభుత్వం మాత్రం ఇది రహదారి భద్రత కోసమే అని చెబుతోంది.
రహదారి ప్రమాదాల నివారణకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా మోటారు వాహన పన్ను సవరణ బిల్లును ఇవాళ అసెంబ్లీలో రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రవేశపెట్టారు. రోడ్ సేఫ్టీకి ప్రత్యేక నిధి, రహదారి భద్రతకు 10% సెస్సు వసూలు చేసుకునేందుకు వీలుగా ఇందులో సవరణలు చేశారు. రాష్ట్రంలో రహదారి ప్రమాదాలను తగ్గించి భద్రతను పెంపొందించేందుకు ఆంధ్రప్రదేశ్ మోటారు వాహనముల పన్ను విధింపు (సవరణ) బిల్లు, 2026ను ప్రవేశపెడుతున్నట్లు మంత్రి మండిపల్లి తెలిపారు.

తాజా బిల్లు ప్రకారం రిజిస్ట్రేషన్ సమయంలో జీవితకాల పన్ను చెల్లించే వాహనాలపై 10 శాతం రహదారి భద్రతా సెస్సు కూడా విధించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ నిధులను రహదారి భద్రతా మౌలిక సదుపాయాల అభివృద్ధి, బ్లాక్‌స్పాట్ల మెరుగుదల, ప్రమాదాల తగ్గింపుకు వాడబోతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సెస్సుతో రాష్ట్రానికి నెలకు సుమారు రూ.22.5 కోట్లు, సంవత్సరానికి రూ.270 కోట్లు ఆదాయం వచ్చే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. అయితే వాహనదారుల జేబులకు మాత్రం చిల్లు పడటం ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications