ఏపీ హైకోర్టులో జగన్ సర్కార్‌కు బిగ్ రిలీఫ్: ఆ పథకం అమలుకు తొలగిన అడ్డంకులు: 128 పిటీషన్లు వెనక్కి
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఏపీ హైకోర్టులో బిగ్ రిలీఫ్ కలిగింది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న పథకం పట్ల ఇదివరకు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ కొట్టేసింది. దాన్ని రద్దు చేసింది. దీనితో ఆ పథకాన్ని అమలు చేయడానికి ఇప్పటిదాకా ఎదురైన న్యాయపరమైన ఇబ్బందులు తొలగిపోయినట్టయింది. పిటీషనర్లు కూడా వెనక్కి తగ్గారు. తాము దాఖలు చేసిన పిటీషన్లను ఉపసంహరించుకున్నారు. దీనిపై ఏకంగా 128 పిటీషన్లు దాఖలయ్యాయి.
ఆ పథకమే- పేదలందరికీ ఇళ్లు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన నవరత్నాల్లో ఇదీ ఒకటి. ఇదివరకు ఈ పథకాన్ని నిలిపివేయాలని ఆదేశిస్తూ ఏపీ హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై జగన్ సర్కార్ అప్పీల్‌కు వెళ్లింది. హైకోర్టు డివిజన్ బెంచ్‌లో సవాల్ చేసింది. రిట్ పిటిషన్‌ను దాఖలు చేసింది. అప్పీల్‌పై విచారణ చేసిన తరువాత.. నిర్ణయం తీసుకోవడానికి అప్పటి ప్రధాన న్యాయమూర్తి అరుప్ కుమార్ గోస్వామి సమక్షానికి పంపించింది.
పేదలందరికీ ఇళ్లు పథకం కింద గృహ నిర్మాణాన్నింటినీ నిలిపివేయాలంటూ అప్పట్లో సింగిల్ జడ్జి బెంచ్ తీర్పు ఇచ్చింది. నెల రోజుల్లోగా నిపుణులతో కమిటీ వేసి, ప్రజాభిప్రాయాన్ని సేకరించాలని, ఆ నివేదికను న్యాయస్థానానికి సమర్పించాలని స్పష్టం చేసింది. అప్పటి వరకు ఇళ్ల నిర్మాణాన్ని నిలిపివేయాలంటూ తీర్పు ఇచ్చింది. సింగిల్ జడ్జి తీర్పుపై జగన్ సర్కార్ హౌస్ మోషన్ పిటిషన్ వేయగా డివిజన్ బెంచ్ తిరస్కరించింది. ఆ తరువాత రిట్ పిటీషన్ రూపంలో అప్పీల్‌కు వెళ్లింది.

దీనిపై సమగ్రంగా విచారణ చేపట్టింది ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ఎస్ శ్రీరామ్ తన వాదనలను వినిపించారు. కోర్టు ఆదేశాల మేరకు పిటిషనర్లకు ఇళ్ల స్థలాలను కేటాయించే విషయంలో అదనపు అఫిడవిట్ దాఖలు చేశామని అన్నారు. సింగిల్ జడ్జి వద్ద పిటీషన్ దాఖలు చేసిన 128 మందిలో చాలామందికి ఇళ్ల స్థలాలు దక్కాయని పేర్కొన్నారు. పిటిషనర్లలో ఎవరికైనా అర్హత ఉండీ, ఇంటి స్థలం రాకపోతే అలాంటి వారికి పట్టాలను అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.
పిటిషనర్ల తరఫున న్యాయవాది వీఎస్ఆర్ ఆంజనేయులు తన వాదనలు వినిపించారు. ప్రభుత్వం పూర్తి సమాచారాన్ని, అదనపు వివరాలు అందజేయాల్సి ఉందని, అప్పుడే తమ వాదనలు వినిపించడానికి వెసులుబాటు ఉంటుందని అన్నారు. దీనికి కొంత సమయం ఇవ్వాలని కోరారు. అర్హులైన పిటిషనర్లకు ఇంటి స్థలం కేటాయించాలన్నదే తమ ఉద్దేశమని పేర్కొన్నారు. ఇరు పక్షాల వాదనలు పరిగణనలోకి తీసుకున్న డివిజన్ బెంచ్ తన తీర్పును వెలువడించిది. సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేసింది.












Click it and Unblock the Notifications