జగన్ సర్కార్ కు హైకోర్టు షాక్- ఆ విచారణ పూర్తయ్యే వరకూ అధికారులు రావాల్సిందే
ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఉపాధి హామీ పనుల బిల్లుల చెల్లింపుపై వైసీపీ సర్కార్ కు హైకోర్టులో ఎదురుదెబ్బలు తలుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే బిల్లుల చెల్లింపుల్లో బకాయిలపై హైకోర్టు పలుమార్లు సర్కార్ కు అక్షింతలు వేసింది. దీంతో పాటు అధికారుల్ని కూడా తరచూ కోర్టులకు రప్పిస్తోంది.. ఇదే కోవలో హైకోర్టు మరో ఆదేశం జారీ చేసింది.
ఏపీలో ఉపాధి హామీ పథకం బిల్లుల చెల్లింపుకు సంబంధించి ఇవాళ హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. ఈ సందర్భంగా స్పందించిన ప్రభుత్వం ఇఫ్పటికే రూ.400 కోట్లు చెల్లించామని, మరో రూ.1100 కోట్లు వారం రోజుల్లో చెల్లిస్తామని కోర్టుకు తెలిపింది. అయితే కోర్టుకు హాజరైన పంచాయతీరాజ్, ఆర్ధికశాఖల కార్యదర్శులు గోపాలకృష్ణ ద్వివేదీ, ఎస్.ఎస్.రావత్ పంచాయతీల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నట్లు తెలిపారు. దీనిపై పిటిషనర్ల తరఫు న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. పనులు చేసిన వారికి డబ్బులు చెల్లించకుండా తిరిగి పంచాయతీల ఖాతాలో వేయడమేంటని ప్రశ్నించారు.

దీనిపై స్పందించిన హైకోర్టు.. పనులు చేసిన కాంట్రాక్టర్ల ఖాతాల్లో డబ్పులు వేయాలని ఆదేశాలు ఇచ్చింది. అధికారుల తీరుపై మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు ధర్మాసనం.. ఈ కేసుల విచారణ పూర్తయ్యే వరకూ కోర్టుకు రావాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటివరకూ ఏపీలో జరిగిన ఉపాధి హామీ పనులకు తాము డబ్పులు చెల్లించామని కేంద్ర ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో.. ఇంకా డబ్బులు రాలేదంటూ రాష్ట్ర ప్రభుత్వం వినిపించిన వాదనను పరిగణనలోకి తీసుకన్న హైకోర్టు.. పూర్తి వివరాలతో అఫిడవిట్లు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 22కు వాయిదా వేసింది.
ఇప్పటికే రాష్ట్రంలో ఉపాధి హామీ పనులు చేసిన కాంట్రాక్టర్లకు ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంపై హైకోర్టు పలుమార్లు ప్రభుత్వాన్ని ఆక్షేపించింది. అయినా వీరంతా టీడీపీ హయాంలో పనులు చేసిన కాంట్రాక్టర్లు కావడంతో వీరికి డబ్బులు విడుదల చేయడం లేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయినా ప్రభుత్వం మాత్రం ఈ విమర్శల్ని లెక్కచేయం లేదు. తాము అనుకున్న విధంగానే పంచాయతీల ఖాతాల్లో ఈ డబ్బులు జమ చేస్తోంది.












Click it and Unblock the Notifications