హైకోర్టులో నిమ్మగడ్డకు మరో షాక్- పరిషత్ ఏకగ్రీవాల డిక్లరేషన్లపై కీలక ఆదేశాలు
ఏపీలో గతేడాది ప్రారంభమైన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియపై ఇవాళ ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. గతేడాది ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఏకగ్రీవాలైన చోట్ల వచ్చిన ఫిర్యాదులపై విచారణ నిర్వహించాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు తోసిపుచ్చింది. ఏకగ్రీవమైన చోట్ల విజేతలకు వెంటనే డిక్లరేషన్ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది.
ఏపీలో గతేడాది ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగకముందే రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల ఏకగ్రీవాలు జరిగాయి. ప్రభుత్వమే ఏకగ్రీవాలను ప్రోత్సహించడంతో అప్పట్లో భారీ ఎత్తున ఏకగ్రీవాలు నమోదయ్యాయి. అయితే వీటిపై విపక్షాలు భారీగా ఎస్ఈసీకి ఫిర్యాదులు చేశాయి. అప్పట్లో కరోనాతో ఎన్నికలు వాయిదా పడటంతో ఈ ఫిర్యాదులు కూడా మూలనపడ్డాయి. కానీ తాజాగా పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ నేపథ్యంలో పరిషత్ పోరుకూ ఎస్ఈసీ సిద్ధమైంది. దీంతో ఈ ఫిర్యాదులు మరోసారి తెరపైకి వచ్చాయి.

ఎంపీటీసీ, జడ్పీటీసీ స్ధానాల్లో ఏకగ్రీవమైన సీట్లపై విపక్షాల ఫిర్యాదుపై స్పందించిన ఎస్ఈసీ తాజాగా విచారణకు ఆదేశాలు ఇచ్చింది. విచారణ పూర్తయ్యే వరకూ గతంలో ఏకగ్రీవమైన సీట్లలో విజేతలకు డిక్లరేషన్లు ఇవ్వొద్దని అధికారులకు సూచించింది. దీంతో విజేతలు హైకోర్టును ఆశ్రయించారు. ఎస్‌ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు గతంలో ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాలు చెల్లవని పేర్కొంది. వెంటనే విజేతలకు డిక్లరేషన్లు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది.












Click it and Unblock the Notifications