ఉపాధి బిల్లుల కేసు-ఈసారి కేంద్రానికి ఏపీ హైకోర్టు షాక్-నాన్ బెయిలబుల్ వారెంట్
ఏపీలో టీడీపీ హయాం నాటి ఉపాధి హామీ పథకం బిల్లుల చెల్లింపుల వ్యవహారంపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే ఈ బిల్లుల్ని పూర్తిగా చెల్లించకపోవడంపై వైసీపీ సర్కార్ పై పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు.. ఇావాళ కేంద్ర ప్రభుత్వంపైనా మండిపడింది. 2014 నుంచి ఉన్న ఉపాధి హామీ బిల్లు చెల్లింపు వివరాలు సమర్పించాలని ఇచ్చిన ఆదేశాలను సరిగ్గా అమలు చేయకపోవడంపై సీరియస్ అయింది.
ఏపీలో ఉపాధి హామీ పథకం బిల్లుల చెల్లింపుకు సంబంధించి పూర్తి సమాచారం ఇవ్వాలని గత విచారణ సందర్భంగా హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే కేంద్రం మాత్రం పాక్షిక వివరాలతో మెమో దాఖలు చేయడంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటివరకూ అఫిడవిట్ దాఖలు చేయనందుకు కోర్టుకు హాజరుకావాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయకపోతే కోర్టుకు హాజరు కావాలని ఆయనకు సూచించింది. అందులోనూ విఫలమైతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని హెచ్చరించింది.

2014 నుంచి ఏపీలో ఉపాధి హామీ బిల్లుల చెల్లింపుకు సంబంధించి కేంద్రం వద్ద ఉన్న వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆధేశించింది. ఇందుకు వారం రోజుల గడువు ఇచ్చింది. ఈ నెల 17న అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. మరోవైపు ఇప్పటికే వైసీపీ సర్కార్ ఉపాధి హామీ బిల్లులు చెల్లించకపోవడంతో టీడీపీతో పాటు ఇతర విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. వైసీపీ సర్కార్ ను టార్గెట్ చేస్తూ బిల్లుల వ్యవహారాన్ని ప్రజల్లోకి కూడా తీసుకెళ్తున్నాయి. అటు హైకోర్టు కూడా తీవ్రంగా స్పందించడంతో పాటు ఇప్పటికే పలువురు ఐఏఎస్ అధికారుల్ని ధిక్కార కేసులో కోర్టుకు రప్పించింది కూడా. అయినా ఇప్పటికీ పూర్తిగా బిల్లుల బకాయి చెల్లింపులు జరగకపోవటం విశేషం.
ఇప్పటివరకూ ఉపాధి హామీ బిల్లుల చెల్లింపులపై రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న హైకోర్టు. ఇప్పుడు తాజాగా కేంద్రాన్ని కూడా నిలదీయడంతో ఈ వ్యవహారం రాజకీయంగా కలకలం రేపుతోంది. టీడీపీ హయాంలో జరిగిన పనులకు తామెందుకు బిల్లులు చెల్లించాలన్న ధోరణిని వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న నేపథ్యంలో హైకోర్టు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.












Click it and Unblock the Notifications