లాక్ డౌన్ లోనూ తిరిగేశారు... హైకోర్టు దృష్టిలో పడ్డారు.. ప్రతివాదులుగా మారారు...
ఏపీలో కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ కొనసాగుతున్నా రాజకీయ నేతల పర్యటనలు మాత్రం యథావిథిగా సాగిపోతున్నాయి. నిత్యావసరాల పంపిణీ పేరుతో కొందరు, పరామర్శల పేరుతో మరికొందరు, అధికారిక కార్యక్రమాలు, ప్రారంభోత్సవాల పేరుతో ఇంకొందరు యథేచ్ఛగా లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. దీనిపై దాఖలైన ఓ పిల్ విచారణ సందర్భంగా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి వారు ఎందరున్నారో గుర్తించి అందరినీ ప్రతివాదులుగా చేర్చాలని సూచించింది.

లాక్ డౌన్ పట్టని నేతలు..
ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్ విధించారన్న మాటా కానీ రాజకీయ నేతలు మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. లా్ డౌన్ విధించిన తర్వాత రెండు మూడు రోజులు ఇళ్లకే పరిమితమైన నేతలు ఆ తర్వాత జూలు విదిల్చారు. నిత్యావసరాల పంపిణీ పేరుతో రోడ్లపైకి, రైతు బజార్లకు, మార్కెట్లకు చేరుకుని జనాన్ని పోగేయడం, ప్రచారం చేసుకోవడం సర్వసాధారణమైపోయింది. ఇప్పటికీ పలువురు నేతలు తమ నియోజకవర్గాల్లో ఇదే తంతు కొనసాగిస్తున్నారు. దీనిపై హైకోర్టులో తాజాగా ఓ పిల్ దాఖలైంది. లాక్ డౌన్ అసలు ఉన్నట్లా లేనట్లా.. నేతలు ఇలా రోడ్లపై తిరగడంలో అర్ధమేంటని పిటిషనర్ కోర్టును ప్రశ్నించాడు. దీంతో ఈ వ్యవహారంపై హైకోర్టు సీరియస్ అయింది.

ఐదుగురు వైసీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు..
కరోనా వైరస్ కారణంగా ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ను ఉల్లంఘించి ప్రజా బాహుళ్యంలో పర్యటనలు ఎందుకు చేశారని ప్రశ్నిస్తూ ఐదుగురు వైసీపీ ఎమ్మెల్యేలకు హైకోర్టు ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. హైకోర్టు నుంచి నోటీసులు అందుకున్న వారిలో నగరి ఎమ్మెల్యే రోజా, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి, పలమనేరు ఎమ్మెల్యే వెంకటయ్య గౌడ, చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజని, సూళ్లూరు పేట ఎమ్మెల్యే సంజీవయ్య ఉన్నారు. వీరంతా ఈ కేసులో కౌంటర్లు దాఖలు చేయాల్సి ఉంది.

ప్రతివాదులుగా మరికొందరు ?
ఏపీలో లాక్ డౌన్ ఉల్లంఘించి జనంలో తిరిగిన వారిలో ఐదుగురు వైసీపీ ఎమ్మెల్యేలే కాదు అదే పార్టీకి చెందిన మరికొందరు నేతలు ఉన్నారు. అలాగే టీడీపీకి చెందిన ప్రజాప్రతినిధులు ఉన్నారు. మిగతా పార్టీలకు చెందిన వారు కూడా ఉన్నారు. వీరి పర్యటనలకు సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయి. దీంతో వీరందరినీ పిటిషన్లో ప్రతివాదులుగా చేర్చాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. తాజా ఆదేశాల నేపథ్యంలో వీరందరికీ ముచ్చెమటలు పడుతున్నాయి. వీరంతా దోషులుగా తేలితే లాక్ డౌన్ నిబంధనల ఉల్లంఘన కింద ప్రస్తుతం సాధారణ ప్రజలకు విధిస్తున్న శిక్షలే వీరికవర్తింపచేయనున్నారు.












Click it and Unblock the Notifications