AP Local Polls: ఏపీ సర్కార్ కు మరో ఊరట- హైకోర్టు కీలక తీర్పు..!
ఏపీలో స్థానిక సంస్ధల ఎన్నికల (AP Local Polls) నిర్వహణకు ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా పురపాలక, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో డివిజన్లు, వార్డుల పునర్విభజన చేపట్టింది. జనాభా ఆధారంగా 3,916 డివిజన్లు, వార్డులను 4,843కి పెంచాలని ఇప్పటికే నిర్ణయించింది. ఇందులో విశాఖపట్నం, మచిలీపట్నంలో వార్డుల పునర్విభజనను సవాల్ చేస్తూ హైకోర్టులో వేర్వేరుగా వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరిపి స్టే ఇచ్చిన హైకోర్టు.. కౌంటర్ వేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ లోపే మరిన్ని పిటిషన్లు దాఖలు కావడంతో ఈ ప్రక్రియ ఆగిపోయింది.
దీంతో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు వీలుగా పావులు కదుపుతున్న ప్రభుత్వం.. గతంలో హైకోర్టు ఇచ్చిన స్టేను సవాల్ చేసింది. దీంతో వార్డులు, డివిజన్ల పునర్విభజనను వ్యతిరేకిస్తూ దాఖలైన 50 పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు.. వాటిని తోసిపుచ్చుతూ కీలక తీర్పు వెలువరించింది. ఈ మేరకు డీలిమిటేషన్ ప్రక్రియపై దాఖలైన పిటిషన్లను కొట్టేస్తూ ఆదేశాలు ఇచ్చింది. దీంతో మున్సిపల్ ఎన్నికల్లో వార్డులు, డివిజన్ల పునర్విభజనకు లైన్ క్లియర్ అయినట్లయింది.

రాష్ట్రంలో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో పురపాలక సంఘాలలో వార్డుల పునర్విభజన చేయవద్దని మొత్తం 50 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ సందర్భంగా ప్రభుత్వం.. తాము వార్డుల వైశాల్యం జోలికి వెళ్ళడం లేదని హైకోర్టుకు తెలిపింది. కేవలం చట్ట నిబంధనల మేరకు ఈ ప్రక్రియ చేపడుతున్నట్లు వెల్లడించింది. దీంతో హైకోర్టు కూడా ప్రభుత్వ వాదనతో ఏకీభవించింది. హైకోర్టు తీర్పుతో త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిన వార్డుల ప్రకారం స్థానిక ఎన్నికలు జరగబోతున్నాయి.














Click it and Unblock the Notifications