
బాలినేని అనుచరుడి దాష్టీకం-కొడాలి, వంశీ కామెంట్లు తప్పన్న కార్యకర్తను చితగ్గొట్టి క్షమాపణ చెప్పించి
ఏపీలో వైసీపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరుడు సుభానీ సొంత పార్టీకి చెందిన వైశ్య సామాజిక వర్గ కార్యకర్తపై దాష్టీకానికి పాల్పడ్డాడు. కొడాలి, వల్లభనేని వంశీ భువనేశ్వరిపై చేసిన వ్యాఖ్యలతో 25 శాతం ఓట్లు పోయాయని వ్యాఖ్యలు చేయడంపై రెచ్చిపొయారు. ఓ రూమ్ లో బంధించి చితగొట్టారు. జరిగింది ఇదేనని చెప్తున్నా వినకుండా పదే పదే ముష్టిఘాతాలు కురిపించారు. చివరికి మోకాళ్లపై కూర్చోబెట్టి మంత్రికి క్షమాపణలు చెప్పించాడు.

బాలినేని అనుచరుడి దాష్టీకం
ప్రకాశం జిల్లాకు చెందిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరుడు సుభానీ తాజాగా రెచ్చిపోయారు. మంత్రి బాలినేనిని ఉద్దేశించి సొంత పార్టీ వైసీపీకి చెందిన కార్యకర్త ఒకరు అనుచిత వ్యాఖ్యలు చేశారని తెలియడంతో అమాంతం విరుచుకుపడ్డారు. అతన్ని బంధించి మరీ చితకొట్టారు. వద్దని చెప్తున్నా వినకుండా ముష్టిఘాతాలు కురిపించారు. దీంతో పాటు ఆ వీడియో తీసి మరీ వైరల్ చేశారు. ఏం చేసుకుంటావో చేసుకో అంటూ హెచ్చరికలు కూడా జారీ చేసారు.

అసలేం జరిగిందంటే ?
తాజాగా వైసీపీ కార్యకర్త సోమిశెట్టి సుబ్బారావు గుప్తా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏపీ అసెంబ్లీలో కొడాలి నాని, వల్లభనేని వంశీ చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై చేసిన వివాదస్పద వ్యాఖ్యలతో వైసీపీకి 25 శాతం ఓట్లు పోయాయని ఆరోపించాడు. ఇది పార్టీకి బాగా మైనస్ అయిందన్నారు. దీంతో పాటు మంత్రి బాలినేని వాటిని సమర్ధించడాన్ని కూడా తప్పుబట్టాడు. దీంతో మంత్రి బాలినేని, ఆయన అనుచరులు సుబ్బారావు గుప్తాపై ఆగ్రహంగా ఉన్నారు. సమయం దొరకడంతో ఆయన్ను చితకొట్టారు. మంత్రి బాలినేని అనుచరుడు సుభానీ తాజాగా ఓ రూమ్ లోకి తీసుకొచ్చి మరీ సుబ్బారావు గుప్తాను మరికొందరితో కలిసి చితకొట్టాడు.

మోకాళ్లపై నిలబెట్టి క్షమాపణ
సుబ్బారావు గుప్తా చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన మంత్రి అనుచరుడు సుభానీ.. మంత్రినే అంటావా అంటూ రెచ్చిపోయారు. తీవ్రంగా కొడుతూ ఆ వ్యాఖ్యలు ఎందుకు చేశావు, ఎవరిపైన చేశావంటూ ప్రశ్నల వర్షం కురపించాడు. ఓవైపు కొడుతూ, మరోవైపు ప్రశ్నిస్తూ నానా టార్చర్ పెట్టాడు. చివరికి మోకాళ్లపై నిలబెట్టి మరీ సుబ్బారావు గుప్తాతో మంత్రి బాలినేనికి క్షమాపణలు చెప్పించారు. అంతే కాదు ఈ తతంగాన్ని కూడా వీడియో తీశారు. ఈ వీడియో కాస్తా వైరల్ గా మారడంతో మంత్రి అనుచరుల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి.
Recommended Video

దాడిపై స్పందించిన బాలినేని
తన అనుచరుడు సుభానీ తాజాగా సుబ్బారావు గుప్తాపై చేసిన దాడిపై మంత్రి బాలినేని స్పందించారు. సోషల్ మీడియాలో వైరల్అవుతున్న వీడియో దృశ్యాల్ని చూశానని, తన అనుచరుడు వద్దన్నా దాడి చేశారని, దీనిపై చర్యలు ఉంటాయన్నారు. అలాగే సుబ్బారావు గుప్తాకు మతిస్దిమితం లేదని ఆయన భార్య చెప్పిందన్నారు. ఎవరైనా ఇళ్లలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. దీంతో ఇప్పుడు బాలినేని ఈ దాడిని సమర్ధించారా లేక కొడాలి, వంశీ వ్యాఖ్యల్ని తప్పుబట్టారా అన్న దానిపై గందరగోళం నెలకొంది.