కోడి కత్తి దాడిని అలిపిరి అటాక్ తో పోల్చిన మంత్రి బొత్స- సంచలన వ్యాఖ్యలు..
ఏపీలో వచ్చే ఏడాది ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కుతున్నాయి. గత ఎన్నికల సమయంలో సంచలనం రేపిన రెండు కేసుల్లో రోజుకో కీలక పరిణామం చోటు చేసుకుంటోంది. ఇందులో ఒకటి వివేకా హత్య కాగా, మరొకటి వైఎస్ జగన్ పై కోడి కత్తి దాడి. ఈ రెండు కేసులతో గత ఎన్నికల్లో రాజకీయ లబ్ది పొందిన వైసీపీపై ఇప్పుడు టీడీపీ విమర్శలు ఎక్కుపెడుతోంది. దీంతో వైసీపీ నేతలు వాటికి కౌంటర్లు ఇవ్వడం మొదలుపెట్టారు.
వైఎస్ జగన్ పై జరిగిన కోడికత్తి దాడిపై టీడీపీ చేస్తున్న విమర్శల్ని మంత్రి బొత్స ఇవాళ తప్పుబట్టారు. విశాఖ ఎయిర్ పోర్టులో జగన్ పై జరిగిన దాడి వాస్తవమని తెలిపారు. కోడికత్తి కేసులో ఎన్‌ఐఏ రిపోర్టును కొన్ని మీడియా సంస్ధలు వక్రీకరిస్తున్నాయని బొత్స మండిపడ్డారు. జగన్ తనపై దాడి చేయించుకున్నారన్న భావన కల్పిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలన్నదే వైసీపీ డిమాండ్ అన్నారు.

అంతటితో ఆగకుండా టీడీపీ అధినేత చంద్రబాబుపై 2004లో జరిగిన అలిపిరి బాంబు దాడి వ్యవహారాన్ని బొత్స కెలికారు.అలిపిరిలో మాజీ సీఎం చంద్రబాబుపై నక్షల్స్ దాడి చేశారని... అది కూడా రాజకీయ లబ్దికోసం బాబు చేయించుకున్నాడా అని ప్రశ్నించారు. జగన్ పై కోడికత్తి దాడికి పాల్పడిన శ్రీనివాస్ ఏ ఉద్దేశ్యంతో చేసాడో తెలియాలన్నారు. ఎన్‌ఐఏ రిపోర్ట్‌లో ఏముందో విపక్షాలకు ఎలా తెలిసిందని బొత్స ప్రశ్నించారు.

మరోవైపు కోడి కత్తి కేసులో ఎన్ఐఏ చెప్పేది వేరు, విపక్షాలు చెప్పేది వేరని వైసీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు, బొత్స మేనల్లుడు కూడా అయిన చిన్న శ్రీను ఆరోపించారు. చంద్రబాబుపై అలిపిరి ఘటనను ఎలా చూడాలని ప్రశ్నించారు.అలిపిరి ఘటన సానుభూతి కోసమేనా అని ఆయన ప్రశ్నించారు. జగన్ పై దాడి కేసులో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని,ఎన్ఏఐఏ మీకు చెప్పిందా అని అడిగారు. నిందితుడు టీడీపీ సానుభుూతి పరుడు కాదా, అలిపిరి ఘటన రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు చేయించుకున్నారా అని బొత్స ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications