ముందస్తు, అసెంబ్లీ రద్దుపై బొత్స కామెంట్స్-ఎమ్మెల్సీ ఓటమి బాధ్యత తనదేనని అంగీకారం...
విజయవాడ : ఏపీలో తాజా రాజకీయ పరిణామాలపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (botsa satyanarayana) కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి, కేబినెట్ విస్తరణ, ముందస్తు ఎన్నికల ఊహాగానాలు, నిన్న అమరావతిలో బీజేపీ నేతలపై జరిగిన దాడి వంటి అంశాలపై బొత్స తనదైన శైలిలో హాట్ హాట్ వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ నాయకులపై దాడి చేయాల్సిన అవసరం తమకేంటని మంత్రి బొత్స ప్రశ్నించారు. రాజకీయ నాయకులు ఎక్కడికైనా వెళ్లినా పరిస్థితులు బట్టి మాట్లాడాలన్నారు. తమపై బురద చల్లేందుకు రాజకీయ ప్రయోజనాలకోసం ఆరోపణలు చేస్తున్నారంటూ బీజేపీ నేతలను ఉద్దేశించి బొత్స వ్యాఖ్యానించారు. అమరావతి ఉద్యమం ఎక్కడిది, షామియాన వేసుకుని నలుగురు కూర్చుంటే ఉద్యమం అవుతుందా అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అండ్ కో దోపిడీ కోసం జరుగుతున్న ఉద్యమం అంటూ విమర్శించారు.

ముందస్తు ఎన్నికలు వస్తే చంద్రబాబు ఇంకా దిగజారిపోతాడంటూ మంత్రి బొత్స వ్యాఖ్యానించారు. అసలు ప్రభుత్వం రద్దు చేయాల్సిన అవసరం మాకేంటని ప్రశ్నించారు. మంత్రివర్గంలో మార్పులు సీఎం గారి ఇష్టమని కేబినెట్ ప్రక్షాళనపై వస్తున్న ఊహాగానాలపై వ్యాఖ్యానించారు. అలాగే ఒక ఎమ్మెల్సీ ఓడిపోయినంత మాత్రాన వచ్చిన నష్టం ఏంటని ఎమ్మెల్సీ ఫలితాలపై స్పందించారు. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల బాధ్యతపైనా బొత్స కీలక వ్యాఖ్యలు చేశారు.
ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఓటమి తన ఫెయిల్యూర్ గా భావిస్తున్నానంటూ బొత్స తెలిపారు. మంత్రిగా ఉండి నేనే ఎమ్మెల్సీ గెలుపు బాధ్యత తీసుకున్నానన్నారు. ఎందుకు ఓడిపోయామనేది సమీక్షించుకుంటున్నామన్నారు. ఓటమికి తప్పు నాది కాదని పారిపోయే వాడిని కాదని బొత్స పేర్కొన్నారు. లోపాలను సరిద్దికుని మళ్లీ రిపీట్ కాకుండా చూసుకుంటామన్నారు.
మరోవైపు రేపటి నుంచి ఎగ్జిక్యూటివ్ రాజధాని విశాఖ ఉండాలని తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. కొన్ని దుష్ట శక్తులు న్యాయవ్యవస్థ లో ఉన్న లొసుగులతో అడ్డుకుంటున్నారని రాజధానుల న్యాయవివాదాలపై వ్యాఖ్యానించారు. వికేంద్రీకరణ అజెండాగా వచ్చే ఎన్నికలకు వెళ్తామన్నారు.












Click it and Unblock the Notifications