పవన్ కు స్వాతంత్ర్యం ఎప్పుడు ? జనసైనికుల ఎదురుచూపులు -మంత్రి అమర్నాథ్ కామెంట్స్
ఏపీలో వైసీపీ, జనసేన మధ్య సాగుతున్న రాజకీయ వైరం ప్రభావం స్వాతంత్ర దినోత్సవం రోజున కూడా కనిపిస్తోంది. ఉదయం జనసేన కార్యాలయంలో జరిగిన స్వాతంత్ర వేడుకల సందర్భంగా జెండావిష్కరణ చేసిన పవన్ కళ్యాణ్.. అనంతరం వైసీపీపై విమర్శలు గుప్పించారు. దీనిపై వైసీపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కౌంటర్ ఇచ్చారు.
స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన రాజకీయ వ్యాఖ్యలపై రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. సొంతంగా ఎన్నికల్లో పోటీ చేయడానికి జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ కి ఎప్పుడు స్వాతంత్య్రం వస్తుందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసే స్వాతంత్రం నీకు ఉందా అని పవన్ ను ఆయన ప్రశ్నించారు. 2024 ఎన్నికల్లో 175 ఎమ్మెల్యే స్థానాలలో, 25 ఎంపీ స్థానాలలో నీ పార్టీ పోటీ చేస్తుందా, లేదా, దీనికి ముందుగా సమాధానం చెప్పు పవన్ కల్యాణ్ అని గుడివాడ అమర్నాథ్ నిలదీశారు.

ఇవాళ దేశమంతా స్వాతంత్య్రం వేడుకలు జరుపుకుంటున్న తరుణంలో పవన్ కళ్యాణ్ రాజకీయ కామెంట్లు చేయడం సిగ్గుచేటని మంత్రి అమర్నాథ్ ఆక్షేపించారు. ఒంటరిగా పోటీ చేసే స్వాతంత్రం లేని నువ్వు స్వాతంత్య్రం గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. అసలు తెలుగుదేశం పార్టీ నుండి జనసేన పార్టీకి స్వతంత్రం వచ్చిందా అని పవన్ కళ్యాణ్ ని సూటిగా ప్రశ్నిస్తున్నానని అమర్నాథ్ తెలిపారు. 76వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో తెలుగుదేశం పార్టీ నుండి స్వతంత్రం కోసం జనసైనికులు ఎదురుచూస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.. చంద్రబాబు నాయుడుకి మేలు చేయడానికే ప్రయత్నిస్తున్నాడు తప్ప, అతని వల్ల, ఆ పార్టీ వల్ల రాష్ట్రానికి ఎటువంటి మేలు లేదన్నారు.












Click it and Unblock the Notifications