జగన్ ఎక్కడుంటే అదే రాజధాని-అది పులివెందులైనా- మంత్రి మేకపాటి సంచలనం
ఏపీలో మూడు రాజధానుల వివాదం మరోసారి తెరపైకి వస్తోంది. రాజధానులపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ నవంబర్ 15కు వాయిదా పడిన నేపథ్యంలో మొదలైన మాటల యుద్ధం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇదే క్రమంలో నెల్లూరు జిల్లాకు చెందిన పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి ఏపీ రాజధానిపై ఇవాళ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయాన్ని విశాఖకు తరలించేందుకు గతంలో ప్రయత్నించిన వైసీపీ సర్కార్ హైకోర్టులో సీఎం ఎక్కడుంటే అక్కడే రాజధాని అని చెప్పింది. సరిగ్గా ఇదే విషయాన్ని మంత్రి మేకపాటి ఇవాళ పునరుద్ఘాటించారు. సీఎం ఎక్కడుంటే అదే రాజధాని అని మేకపాటి అన్నారు. అది పులివెందులైనా, విజయవాడ అయినా భవిష్యత్తులో మరో ప్రాంతమైనా అని మేకపాటి వ్యాఖ్యానించారు చిత్తూరు జిల్లా సమీక్షా సమావేశంలో పాల్గొన్న సందర్భంగా మేకపాటి ఈ వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడూ సౌమ్యుడిగా కనిపించే మంత్రి మేకపాటి చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.

సీఎం జగన్ మోహన్ రెడ్డి నివాసం ఎక్కడ ఉంటే అది సచివాలయం, అదే రాజధాని అని అనుకోవాలని మంత్రి మేకపాటి వెల్లడించారు. గతంలో చేసుకున్న శ్రీబాగ్ ఒప్పందం ప్రకారమే జగన్ మూడు రాజధానుల్ని తెరపైకి తెచ్చారని, దీనికి అందరి ఆమోదం ఉందన్నారు. ఇప్పటికే విశాఖలో కార్యనిర్వాహక రాజధాని, కర్నూల్లో న్యాయ రాజధాని, అమరావతిలో చట్ట సభల రాజధాని ఏర్పాటు చేసేందుకు వీలుగా ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లుల్ని ఆమోదించగా.. దీనికి గవర్నర్ ఆమోదం కూడా లభించింది. అయితే హైకోర్టులో దీనికి వ్యతిరేకంగా విటిషన్లు దాఖలు కావడంతో విచారణ ఆలస్యమవుతోంది.
అదే సమయంలో వైసీపీ మంత్రులు, నేతలు తాజాగా రాజధానులకు అనుకూలంగా రాష్ట్రవ్యాప్త్గంగా పలు సందర్భాల్లో వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇదే క్రమంలో మంత్రి మేకపాటి చేసిన వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశమవుతున్నాయి. ఇప్పటికే మంత్రులు బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్ తో పాటు మరికొందరు నేతలు కూడా రాజధానులపై నిత్యం మాట్లాడుతున్నారు. రాజధానుల ఏర్పాటు ఆలస్యం నేపథ్యంలో ప్రజల్లో అసహనం పెరుగుతుండటంతో వైసీపీ మంత్రుల వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.












Click it and Unblock the Notifications